వర్షాలొచ్చేనా.. అండమాన్ లో అల్పపీడనం..!
Cyclonic circulation may form over South Andaman Sea on May 4. భారతదేశంలో ఎండలు ఊహించని విధంగా ఉన్నాయి. తీవ్రమైన ఎండకు ప్రజలు
By Medi Samrat
భారతదేశంలో ఎండలు ఊహించని విధంగా ఉన్నాయి. తీవ్రమైన ఎండకు ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. త్వరలోనే వర్షాలు పలకరించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, మే 4వతేదీన దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడవచ్చని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) తెలిపింది.
మే 4వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఈ తుపాన్ ప్రభావంతో మే 4వతేదీన అండమాన్, నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో, మే 4న నికోబార్ దీవులపై భారీ వర్షపాతం కురవవచ్చు. మే 4న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా గాలులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
ఎండలు తీవ్రతరమవుతోన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, యానాం ప్రాంతంలో వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న తిరుపతిలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. విజయవాడలో ఉష్ణోగ్రత 44.8 డిగ్రీలను తాకింది. తెలంగాణలో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.