ఆ వెంట‌నే కొత్త అధ్యక్షుడు వ‌స్తారు : చిదంబరం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Aug 2020 3:13 AM GMT
ఆ వెంట‌నే కొత్త అధ్యక్షుడు వ‌స్తారు : చిదంబరం

రాబోయే మూడు, నాలుగు నెలల్లో ఏఐసీసీ ఎన్నికలు జరుగుతాయని.. అవి పూర్తవ‌గానే నూతన అధ్యక్షుణ్ని ఎన్నుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వెల్లడించారు. ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా కాలం నడుస్తున్నందున‌ ఎన్నికలు నిర్వహించలేమని ఆయన అన్నారు.

గాంధీ కుటుంబ వ్య‌క్తులు త‌ప్ప వేరోక‌రు మీకు అధ్యక్ష పగ్గాలకు క‌ట్ట‌బెట్టేందుకు కనిపించరా? అని ప్రశ్నించగా.. ఈ విష‌య‌మై ఆలోచ‌న‌లు జ‌రిపామ‌ని.. దాని నుండి బయటపడటానికి ఓ కొత్త మార్గం కనుగొన్నామన్నారు. కరోనా కార‌ణంగా కాస్త వేచిచూసే ధోరణిలో ఉన్నామని స‌మాధాన‌మిచ్చారు. అలాగే.. సోనియా, రాహుల్‌లు పార్టీలో క్రియాశీలకంగా లేరన్నది పూర్తి అవాస్తవమని అన్నారు.

రాహుల్ పూర్తి క్రియాశీలకంగా ఉన్నారని.. సోనియా కూడా క్రియాశీలకంగానే ఉన్నారని.. అయితే కరోనా మహమ్మారి కారణంగా ప్రజల్లోకి రావడం లేదని ఆయన స్పష్టం చేశారు. 2004 సంవ‌త్స‌రంలో బీజేపీలో కూడా ఇలాగే జరిగిందని.. అప్పుడు బీజేపీని మీడియా ప్రశ్నించలేదని.. కాంగ్రెస్ వెంటే పడుతోందని విమర్శించారు. మీడియా ఎప్పుడూ విపక్షం వైపే ఉండాలని ఆయన సూచించారు.

గ‌త‌ ఎన్నికల్లో ఓట‌మి తర్వాత దానికి గల కారణాలను చాలా సార్లు పార్టీలో చర్చించుకున్నామని.. మోదీ హవా కొనసాగుతున్నా.. తామూ కొన్ని రాష్ట్రాల్లో గెలుపొందిన‌ట్లు చిదంబ‌రం గుర్తు చేశారు.

Next Story