కేసీఆర్ కోపానికి ఏపీ సీఎం జగన్ కూల్ చెక్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Aug 2020 6:06 AM GMT
కేసీఆర్ కోపానికి ఏపీ సీఎం జగన్ కూల్ చెక్

ఒక మాట అన్నంతనే.. అందుకు బదులుగా రెండు మాటలు అనటం ఇప్పటివరకు చూస్తున్న రాజకీయం. అందుకు భిన్నంగా.. ఒక మాటకు ప్రతిగా మౌనంగా ఉండటం ఇప్పుడు సరికొత్త రాజకీయంగా మారింది. అనూహ్యంగా తెర మీదకు వచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం.. కొత్తగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ వ్యాఖ్యలు ఇస్తారేమోనని పలువురు ఏపీ సీఎం జగన్ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.

ఊహించని రీతిలో వ్యవహరించిన జగన్.. కేసీఆర్ మాటలపై కించిత్ కూడా స్పందించకుండా ఉండటం గమనార్హం. అంతేకాదు.. కేసీఆర్ మాదిరి రియాక్ట్ కాకుండా కూల్ గా వ్యవహరిస్తుండటం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బయట స్పందించొద్దని.. తాము ఏం చెప్పాలనకుంటున్న విషయాల్ని అపెక్స్ కౌన్సిల్ లోనే సరైన సమాధానం చెబుదామని పేర్కొనటం ఇప్పుడు కొత్తగా ఉందని చెప్పాలి.

మాటకు మాట ఏ మాత్రం సమాధానం కాదని.. ఎక్కడ ఏం చెప్పాలో.. అక్కడ చెప్పటం ద్వారా అనవసరమైన రాజకీయ అలజడిని అడ్డుకున్నట్లు అవుతుందన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. దీనికి తగ్గట్లే ఏపీ అధికారులతో మాట్లాడే క్రమంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో తాము స్నేహపూర్వక వాతావరణం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పటం ద్వారా.. తెలంగాణ ఎమోషనల్ ఫైరింగ్ కు తనదైన కూల్ నెస్ తో.. వేడెక్కిన వాతావరణాన్ని చల్లబర్చటం ఇప్పుడు సరికొత్తగా ఉందని చెబుతున్నారు.

ఇక‌ తెలంగాణ విష‌యానికొస్తే లొల్లి పెట్టుకోవటం ఇష్టం లేదంటూనే.. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంటే.. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని స్పష్టంగా చెప్పేయటం గమనార్హం. అంతేకాదు.. తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని.. విభజనకు ముందు నుంచి ఇచ్చిన ఉత్తర్వుల్ని సిద్ధం చేయాలని అధికారులకు క్లియర్ గా ఏమేం చేయాలన్న దానిపై స్పష్టత ఇచ్చినట్లు చెబుతున్నారు. అవసరానికి తగ్గట్లు ఆగ్రహావేశాల్ని ప్రదర్శించే తెలంగాణ సీఎం కేసీఆర్ కు సైతం అర్థం కాని రీతిలో.. తన కూల్ నెస్ తో జగన్ వ్యవహరిస్తున్నారు. ఆయన తీరు చూస్తే.. మాటలతో అగ్గి పుట్టించేకన్నా.. చేతలతో చేయాల్సింది చేస్తే సరిపోతుంది కదా? అన్నట్లు ఉందంటున్నారు. చూస్తుంటే.. కేసీఆర్ కు ఒక పట్టాన అర్థం కాని రీతిలో ఏపీ సీఎం జగన్ రియాక్షన్ ఉందన్న భావన వ్యక్తమవుతోంది.

Next Story