ఆ కుటుంబంలో తీరని విషాదం.. కుమారుడి అంత్యక్రియలు నిర్వహిస్తూ కుప్పకూలిన తండ్రి
Father collapsed to death while performing son's funeral in Visakhapatnam. కుమారుడికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఓ తండ్రి ఒక్కసారిగా కుప్పకూలి మృతి
By Medi Samrat Published on 13 Feb 2022 9:42 AM GMT
కుమారుడికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఓ తండ్రి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. ఇద్దరి మరణం ఆ ఇంటి ఇళ్లాలుకు తీరని లోటును మిగిల్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జివిఎంసి 61వ వార్డు మల్కాపురంలో నివాసముంటున్న అప్పారావు తన భార్య లక్ష్మి, కుమారుడు బైన గిరీష్ (24), ఇద్దరు కుమార్తెలతో కొన్నేళ్లుగా నగర వీధిలో నివసిస్తున్నాడు. అప్పారావు హెచ్‌పీసీఎల్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాడు. యానిమేషన్ కోర్సు చదువుతూ అనారోగ్యంతో శనివారం గిరీష్ మృతి చెందాడు.
విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన అప్పారావు కొడుకు మృతిని చూసి షాక్‌కు గురయ్యాడు. భార్యను ఓదార్చి అంత్యక్రియలకు సిద్ధమయ్యాడు. స్థానిక కోరమాండల్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. అప్పారావు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబీకులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు చెప్పడంతో.. కుటింబికులు మరింత విషాదంలో మునిగిపోయారు.
గంటల వ్యవధిలోనే కొడుకుతో సహా భర్త ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కుమారుడి మృతదేహం పక్కనే తండ్రి అంత్యక్రియలను బంధువులు నిర్వహించారు. ఓ కుటుంబంలో చోటుచేసుకున్న ఘటనతో మల్కాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.