Fact Check : న్యూజిలాండ్ లో అరిటాకు మీద భోజనాలు చేశారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Aug 2020 4:59 PM IST
Fact Check : న్యూజిలాండ్ లో అరిటాకు మీద భోజనాలు చేశారా..?

అరిటాకు మీద భోజనం చేయడం ఎంతో మంచిదని చెబుతూ వస్తుంటారు. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో అరిటాకు మీద భోజనాన్ని చేస్తూ ఉంటారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అరిటాకు మీద కొందరు భోజనం చేస్తున్న ఫోటో వైరల్ అవుతోంది. భారత సంస్కృతి సంప్రదాయాలను న్యూజిలాండ్ లో పాటిస్తూ ఉన్నారని ఈ ఫోటో గురించి చెప్పుకొచ్చారు. న్యూజిలాండ్ లో భారత సంస్కృతిని పాటిస్తున్నారని పలువురు ట్వీట్లు చేశారు.

చాలా పేజీలు ఈ ఫోటోను పోస్టు చేసి న్యూజిలాండ్ లో చోటుచేసుకున్న ఘటన అంటూ చెప్పుకొచ్చారు. “Importance of Bharatiya Culture in New Zealand #SanatanaDharma” అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

’Bharat Land of Gods’ అనే ఫేస్ బుక్ గ్రూప్ లో కూడా ఆగష్టు 19, 2020న పోస్టు చేశారు. అందులో కూడా ఈ ఫోటో న్యూజిలాండ్ లో తీసిందని చెప్పుకొచ్చారు.

నిజ నిర్ధారణ:

న్యూజిలాండ్ లో చోటుచేసుకున్న ఘటన అని చెబుతున్న పోస్టులో ఎటువంటి 'నిజం లేదు'.

ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ‘Happy Yoga Travels’ అనే బ్లాగ్ లో కనిపించాయి. “MY YOGA VACATION AT SIVANANDA ASHRAM IN KERALA, INDIA” అంటూ ఆ ఫోటోలకు టైటిల్ ను ఉంచారు.

కేరళ లోని శివానంద ఆశ్రమం అంటూ సెర్చ్ చేయగా ఆ సంస్థకు చెందిన అధికారిక వెబ్ సైట్ ను గమనించవచ్చు. శివానంద యోగ వేదాంత ధన్వంతరి ఆశ్రమం తిరువనంతపురం లోని యోగా ఆశ్రమంగా పేరుగాంచింది. ది ఇంటర్నేషనల్ శివానంద యోగ వేదాంత సెంటర్స్ ఆధ్వర్యంలో వీటిని నడిపిస్తూ ఉన్నారు.

నీలం రంగు ఫ్లోర్ మీద కూర్చుని భోజనాలు తింటున్న పలు ఫోటోలు వెబ్ సైట్ లోని ‘Yoga Vacation’ పేజీలో చూడొచ్చు. వైరల్ అవుతున్న ఫోటోలు శివానంద ఆశ్రమం కేరళకు చెందినవిగా అర్థం అవుతోంది. వెనుకనే ఉన్న పసుపు రంగు పిల్లర్లు, స్పీకర్స్, నీలం రంగు ఫ్లోరింగ్ వైరల్ అవుతున్న ఫోటోలో చాలా వరకూ ఒకటేలా ఉన్నాయి.

ఫిబ్రవరి 2013న కూడా ఈ ఫోటోను Trip Advisor లో పోస్టు చేశారు. శివానంద యోగ వేదాంత ధన్వంతరి ఆశ్రమం ఆశ్రమం త్రివేండ్రం (తిరువనంతపురం) అంటూ చెప్పుకొచ్చారు.

సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోను న్యూజిలాండ్ లో తీశారు అని చెబుతూ ఉన్నదాంట్లో నిజం లేదు.

Next Story