Fact Check : హైదరాబాద్ లో గణేశుడి విగ్రహాన్ని పెట్టకుండా ముస్లింలు అడ్డుకున్నారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Aug 2020 1:35 PM GMTహైదరాబాద్: ముస్లింలు గణేశుడి విగ్రహాన్ని పెట్టకుండా అడ్డుకున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. విగ్రహాన్ని, మంటపాన్ని వారు ధ్వంసం చేశారన్న ప్రచారం జరుగుతోంది.
Uttam Chaurasiya అనే ట్విట్టర్ ఖాతాలో 'స్థానికంగా ఉన్న గూండాలు హైదరాబాద్ లో గణేశుడి విగ్రహాన్ని పెట్టకుండా అడ్డుకున్నారు. అంతేకాదు విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. దీంతో కొందరు వారిని కొట్టాల్సి వచ్చింది. నిజాం రజాకార్లకు మద్దతుగా కేసీఆర్ పనిచేస్తున్నాడు' అని చెప్పుకొచ్చాడు. ఆ గొడవకు సంబంధించిన వీడియోను కూడా పోస్టు చేశాడు. హిందువుల వ్యతిరేకి కేసీఆర్ అంటూ అందులో చెప్పుకొచ్చాడు.
ఆ వీడియోలో కొందరు కలిసి ఇద్దరు యువకులను కొడుతుండడం చూడొచ్చు. నడిరోడ్డులో వినాయకుడి విగ్రహం కూడా ఉంది. బూతులు తిడుతూ కొడుతూ ఉండగా పోలీసులు వారిని అడ్డుకోవడం వీడియోలో రికార్డు అయింది.
ఈ ఘటనకు సంబంధించిన మరికొన్ని వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. హిందూ-ముస్లింల మధ్య గొడవ అంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు.
నిజమెంత:
హిందువులు గణేశుడి విగ్రహాన్ని పెడుతున్నప్పుడు ముస్లింలు అడ్డుకున్నారన్న పోస్టులలో 'ఎటువంటి నిజం లేదు'. ఒకటే కుటుంబానికి చెందిన బంధువుల మధ్య ఈ గొడవ జరిగింది.
న్యూస్ మీటర్ కు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన హైదరాబాద్ లోని లాల్ దర్వాజా ప్రాంతంలోని మొఘల్ పుర పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ గొడవ మొత్తం హిందువుల మధ్య.. అది కూడా బంధువుల మధ్య చోటుచేసుకుంది. ముస్లింలకు ఈ గొడవకు ఎటువంటి సంబంధం లేదు. కుటుంబ సభ్యుల్లో ఒక వర్గం వారు తాము చెప్పిన చోట గణేశుడి విగ్రహాన్ని పెట్టాలని కోరగా.. మరికొందరు అందుకు అంగీకరించలేదు. దీంతో అక్కడ గొడవ చోటుచేసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడైతే విగ్రహాన్ని పెడుతున్నారో అక్కడే ఉంచాలన్న విషయంలో గొడవ చోటు చేసుకోగా ఆ తోపులాటలో విగ్రహం చేయి విరిగిపోయింది.
@CPHydCity కూడా ఈ ఘటనపై వైరల్ అవుతున్న వార్తలకు చెక్ పెడుతూ ట్వీట్ కూడా చేశారు. ఈ గొడవ ఒకే కమ్యూనిటీలో ఉన్న వారి మధ్య చోటుచేసుకుందని.. పోలీసులు, కొందరు పెద్దలు కలిసి ఈ గొడవ సద్దుమణిగేలా చేశారని స్పష్టం చేశారు. కొన్ని అల్లరి మూకలు ఈ వీడియో మతాల మధ్య చోటుచేసుకున్న గొడవ అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు.. అటువంటివి సహించమని చెబుతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ పోస్టులలో 'నిజం లేదు'.