మూడు పార్టీలకు వెల్లంపల్లి సూటి ప్రశ్న.. ఎవరు బదులిస్తారు.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Sep 2020 6:32 AM GMT
మూడు పార్టీలకు వెల్లంపల్లి సూటి ప్రశ్న.. ఎవరు బదులిస్తారు.?

అంతర్వేది రథం దగ్దం అయిన ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వేసిన ప్రశ్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. రథం దగ్దం ఘటనను రాజకీయంగా, మత పరంగా అడ్వాంటేజ్ తీసుకోవాలని టిడిపి, బిజెపి, జనసేన ప్రయత్నాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఘటనను సిబిఐతో విచారణ చేయిస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో వీళ్ళ ప్లాన్ పెద్దగా ముందుకు సాగలేదు. సిబిఐ విచారణకు సిఫారసు తర్వాత అంతర్వేదిలో ఆటోమేటిక్ గా ఆందోళనలు తగ్గిపోయాయి.

ఇదే విషయమై వెల్లంపల్లి మాట్లాడుతూ.. అంతర్వేదిలో రథం దగ్దం అంశాన్ని రాజకీయం చేయటాన్ని తప్పుపట్టారు. అదే సమయంలో 2017లో పెంటపాడులో శ్రీ గోపాలస్వామి దివ్యరథం దగ్దం అయిపోయిన ఘటనకు చంద్రబాబునాయుడు, సోమువీర్రాజు, పవన్ కల్యాన్ బాధ్యత వహిస్తారా ? అంటూ మంత్రి నిలదీశారు. మంత్రి ప్రశ్నలో లాజిక్ ఉంది. ఎలాగంటే 2017లో రథం దగ్దం అయినపుడు టిడిపి+బిజెపి+జనసేన ప్రభుత్వంలో భాగస్తులే అన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో రథం దగ్దం అయిన ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం ఎవరిపైనా చర్యలు ఎందుకు తీసుకోలేదని మంత్రి వేసిన ప్రశ్నకు ముగ్గురిలో ఎవరు సమాధానం ఇస్తారో.?

అంతర్వేది రథం దగ్దం విషయంలో ఇంత హడావుడి చేస్తున్న చంద్రబాబు, వీర్రాజు, పవన్ ఆరోజు ఎందుకు నోరుమెదప లేదంటూ మంత్రి సూటిగానే నిలదీశాడు. అప్పట్లో ఘటనను తమ పార్టీ ఓ దురదృష్టకరమైన ఘటనగా మాత్రమే చూసిన కారణంగా తాము రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నం చేయలేదన్న విషయాన్ని కూడా మంత్రి గుర్తుచేశారు. కానీ ఇపుడు మాత్రం మూడు పార్టీలు ఎందుకింత గోల చేస్తున్నాయో అర్ధం కావటం లేదంటూ మంత్రి మండిపోయారు. అప్పటి ఘటనకు బాధ్యత తీసుకోని మూడు పార్టీలు ఇపుడు మాత్రం ఎందుకు రెచ్చిపోతున్నాయంటూ వేసిన ప్రశ్నకు మరి ఎవరు సమాధానం చెబుతారో?.

Next Story