'వంగవీటి' సొంత గూటికే చేరనున్నాడా..?
By సుభాష్ Published on 14 Dec 2019 5:44 PM ISTరాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరనేది మరోసారి నిజం చేసేందుకు సిద్దమవుతున్నారు వంగవీటి రాధాకృష్ణ. కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నాడని ప్రచారం జోరుగా సాగుతోంది. విజయవాడ రాజకీయాల్లో ఒకప్పుడు ఐకాన్‌గా ఉన్న వంగవీటి కుటుంబం నుంచి వచ్చిన యువ నాయకుడిగా వంగవీటి రాధాకృష్ణ గుర్తింపు పొందారు. కాంగ్రెస్ తర్వాత ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసీపీ ఇలా ఒక పార్టీ అంటూ లేకుండా వంగవీటి రాధాకృష్ణ దూకుడు ప్రదర్శించారు. ఒకప్పుడు ఎన్ని సమస్యలు ఎదురైనా.. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా వంగవీటి కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. ఆ పార్టీని అన్ని విధాలా ఆదుకున్నారు. అలాంటి నాయకుడి కుమారుడుగా వచ్చిన వంగవీటి రాధాకృష్ణ 2004లో వైఎస్ ఆశీస్సులతో విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ టికెట్‌పై గెలుపొందారు. తర్వాత ఇప్పటి వరకు ఆయన ఓటమి పాలవుతూనే వస్తున్నారు. ఈ ఏడాది జగిన ఎన్నికలకు ముందు వరకు ఆయన వైసీపీలోనే ఉన్నారు. అయితే, తనకు సెంట్రల్ నియోజకవర్గం కావాలని కోరారు. అది దక్కక పోవడంతో అలిగి టీడీపీకి జై కొట్టారు. ఆ తర్వాత వంగవీటి రాధాకృష్ణ వ్యవహరించిన తీరు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. పార్టీలు మారడం రాజకీయాల్లో మామూలేనని అందరూ భావించారు.
ప్రతిజ్ఞలు చేసిన వంగవీటి చివరకు..
కాగా, రాధాకృష్ణ పార్టీ మార్పుతో పాటు .. జగన్‌ను అధికారంలోకి రాకుండా చేస్తానని ప్రతిజ్ఞలు కూడా చేశారు. అదే సమయంలో తన తల్లితో కలిసి ఆయన చంద్రబాబుకు మరోసారి అధికారం దక్కాలనే కోరికతో యజ్జాలు చేయించారు కూడా. రాధాకృష్ణ ఇలాంటివి చేయడం వల్ల వైసీపీ నేతల్లో ఆగ్రహం పెంచేలా చేసింది. ఎన్నికల జనాలు టీడీపీకి స్వస్తి పలికి, వైసీపీకి జై కొట్టారు. తర్వాత వంగవీటి రాధాకృష్ణకు చేసిన ప్రయోగాలు అన్ని ఫెయిల్ అయ్యాయి. కాగా, చంద్రబాబు ఆయన ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చాడని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇక టీడీపీకి వచ్చే ఎన్నికల తర్వాత గెలిస్తే తప్పా ఎమ్మెల్సీ వచ్చే ఛాన్స్ లేకుండా పోయింది వంగవీటికి. దీంతో ఆయన ఎన్నికల తర్వాత మౌనంగా ఉండిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గౌరవం లేకపోవడంతో ఇప్పుడు జగన్ వైపు చూపులు మొదలైనట్లు తెలుస్తోంది.
మంత్రి నానితో మంతనాలు..
రాధాకృష్ణకు గుడివాడ ఎమ్మెల్యే , మంత్రి కొడాలి నానితో మంచి పరిచయం ఉంది. వీరి పార్టీలు వేరైనా.. వీరి మధ్య మంచి స్నేహమే ఉంది. ఇప్పుడు కొడాలి నాని సాయంతో వంగవీటి వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పార్టీలో చేరే అంశంపై శుక్రవారమే చర్చలు కూడా జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. విజయవాడలో ఎంతో పట్టున్న వంగవీటి రాధాకృష్ణకు మళ్లీతీర్థం ఇవ్వొచ్చని అందరూ భావిస్తున్నారు. ఆయన పార్టీలో చేరే విషయంపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని రాజకీయ నేతల్లో చర్చ మొదలైంది.