స్కూళ్లు, కాలేజీలు జూలై 31 వరకు బంద్
By సుభాష్ Published on 30 Jun 2020 10:54 AM ISTదేశ వ్యాప్తంగా కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా వైరస్ వల్ల అన్ని రంగాలతో పాటు విద్యాసంస్థలైన పాఠశాలలు, కళాశాలలు సైతం మూతపడ్డాయి. ఇక అన్‌లాక్ 1.0 నేటితో ముగియనుంది. రేపటి నుంచి అన్‌లాక్ 2.0 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ యథావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఇక పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు జూలై 31వ తేదీ వరకు తెరవకూడదని ఆదేశించింది. సోమవారం కేంద్ర హోంశాఖ అన్‌లాక్ 2.0 విధివిధానాలను ప్రకటించింది. ఈ నిబంధనలన్నీ జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆన్‌లైన్, దూర విద్య కోర్సులు కొనసాగుతాయని హోంశాఖ స్పష్టం చేసింది. మెట్రో సర్వీసులు, జిమ్ములు, సినిమా థియేటర్లపై నిషేధం కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. కరోనా వైరస్ తీవ్రంగాఉన్న నేపథ్యంలో వీటిపై సడలింపులు ఉండవని తెలిపింది. ఇక అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం ఉన్నప్పటికీ, విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు హోంశాఖ అనుమతి మేరకే పలు సర్వీసులు నడవనున్నాయి.
అలాగే సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యక్రమాలపై ఎప్పటిలాగే నిషేధం ఉంటుందని తెలిపింది. దేశీయ విమానాలుఎ, ప్యాసింజర్ రైళ్లను దశల వారీగా పూర్తిస్థాయిలో పునరుద్దరిస్తామని పేర్కొంది. ఇక బయటకు వెళ్లే వారు మాస్కులు తప్పనిసరి ధరించాలని స్పష్టం చేసింది. కోచింగ్ సెంటర్లు, శిక్షణ సంస్థలపై జూలై 31 వరకు నిషేధం ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థలకు కొంత వెలుసుబాటు ఇచ్చింది. సిబ్బంది వ్యవహారాలశాఖ అనుమతుల మేరకు వీటిని తెరుచుకోవచ్చని సూచించింది. అలాగే ఉద్యోగస్తులు సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోం చేసుకోవాలని తెలిపింది. అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ ఉంటుందని పేర్కొంది.