అన్‌లాక్‌ 2.0: కీలక మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

By సుభాష్  Published on  30 Jun 2020 4:22 AM GMT
అన్‌లాక్‌ 2.0: కీలక మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

దేశం వ్యాప్తంగా కరోనా వైరస్‌ విరుచుకుపడుతోంది. దీంతో రెండు నెలలపాటు లాక్‌డౌన్ విధించి కట్టడి చేశారు. తర్వాత ఆర్థిక పరిస్థితులు మందగించడంతో లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చారు. ఇక అన్‌లాక్‌ 1.0 ముగిసింది. రేపటి నుంచి అన్‌లాక్‌ 2.0 మొదలు కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం రాత్రి అన్‌లాక్‌ 2.0కు సంబంధించి పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.

కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కంటైన్‌మెంట్‌ జోన్లలో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉండనుంది. అటు కంటైన్‌మెంట్‌ జోన్లలో కేవలం అత్యవసర, నిత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చింది.

ఇక ప్రయాణాలపై ప్రభుత్వాలు ఎటువంటి ఆంక్షలు పెట్టవద్దని కేంద్రం స్పష్టం చేసింది. ఒక రాష్ట్ర నుంచి మరో రాష్ట్రానికి, రాష్ట్ర పరిధిలోని ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లేందుకు ప్రయాణికులపై, నిత్యవసరాల రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని కేంద్రం సూచించింది. అంతేకాదు ప్రయాణికులకు ప్రయాణాల కోసం ఎలాంటి అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా, కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల ఆంక్షలు విధించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ నిబంధనలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

కీలక మార్గదర్శకాలు ఇవే..

► విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చేందుకు అవకాశం

► బయట తిరిగేవారంతా మాస్కులు తప్పనిసరి

► ప్రయాణ సమయంలో ప్రయాణికులు మాస్కులు తప్పనిసరిగ్గా ధరించాలి

► బయట ప్రదేశాల్లో ప్రతిచోట ఆరు అడుగులతో భౌతిక దూరాన్ని పాటించాలి

► వివాహ, ఇతర శుభకార్యాలకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి

► అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి

► భారీ సంఖ్యలో జనం గూమిగూడకుండా చర్యలు తీసుకోవాలి

► పని ప్రదేశాల్లో ఎక్కువ మంది నిత్యం శానిటైజర్లు తప్పనిసరి.

► దుకాణదారులు కేంద్ర మార్గదర్శకాలు పాటించాలి

► కేంద్ర, రాష్ట్రాల విధివిధానాలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పనిసరి.

► అన్ని కంపెనీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి.

► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం. ఒక వేళ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు

► బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, పొగాకు ఉత్పత్తులకు నిషేధం

► అలాగే తప్పుడు సమాచారం ఇచ్చినవారిపై కఠిన చర్యలు

Next Story