నిజమెంత: అమిత్ షా కు కోవిద్-19 పాజిటివ్ వచ్చిందా..?

By అంజి
Published on : 8 April 2020 4:52 PM IST

నిజమెంత: అమిత్ షా కు కోవిద్-19 పాజిటివ్ వచ్చిందా..?

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోవిద్-19 వైరస్ ఎవరికైనా సోకే అవకాశం ఉంది. పెద్ద పెద్ద లీడర్ల కు కూడా ఎంతో మందికి సోకింది ఈ మహమ్మారి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండడంతో లండన్ లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండడంతో వైద్యులు ఆక్సిజన్ అందిస్తున్నారు. మరిన్ని దేశాల్లో ఎంతో మంది రాజకీయ నాయకులకు, రాజ కుటుంబీకులకు కూడా కరోనా వైరస్ సోకింది.

తాజాగా భారత హోమ్ మినిస్టర్ అమిత్ షా కు కరోనా వైరస్ సోకిందని ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు చెందిన స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. అది మార్ఫింగ్ చేసిన ఫోటో అని.. దాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారని.. దాని మీద ఉన్నదంతా అబద్ధపు సమాచారం అని పిఐబి తెలిపింది.

Union home minister Amit shah

ఇది 'ఫేక్ ఫోటో' అని.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకండని సూచించింది.

సదరు టీవీ ఛానల్ లో కూడా ఇలాంటి వార్త ప్రసారం చేయలేదని స్పష్టం అవుతోంది. ఎవరో కొందరు కావాలనే అమిత్ షా మీద ఇలాంటి వార్తలను వ్యాప్తి చేస్తున్నారని అర్థమవుతోంది. కొందరికి సంబంధించిన విషయాలను షేర్ చేయడంలో ఆచితూచి వ్యవహరించడం మన ముందు ఉన్న కర్తవ్యం. కొన్ని కొన్ని సార్లు పోలీసుల వరకూ విషయం వెళ్లే అవకాశం ఉంది.

కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో లేని పోని పుకార్లను సృష్టిస్తూ ఉన్న వారిపై సైబర్ క్రైమ్ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది.

Next Story