మూడు రాజధానుల అంశంపై అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం.. ఏం చెప్పిందంటే..?
By తోట వంశీ కుమార్ Published on 6 Aug 2020 3:38 PM ISTఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై మరింత క్లారిటీ వచ్చింది. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది మాత్రమేనని కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని ఏర్పాటు అనేది కేంద్ర పరిధిలోని అంశమని ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. పూర్తి వివరాలలో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయ స్థానం కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.
హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని తెలిపింది. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని పేర్కొంది. రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం రాజధానిని ఎంపిక చేసేందుకు శివరామకృష్ణన్ కమిటీని నియమించామని కేంద్రం చెప్పింది. అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించిందని.. ఇందులో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదంది. ప్రస్తుతం ప్రభుత్వంపరిపాలనా వికేంద్రీకరణకు సంబంధించి ఒక గెజిట్‌ను విడుదల చేసింది. గెటిట్ ప్రకారం ఏపీలో మూడు పాలనా కేంద్రాలు ఉంటాయని.. శాసన రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖటపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును పేర్కొన్నారు అని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. దీంట్లో కూడా తమ ప్రమేయం ఏం లేదని స్పష్టం చేసింది.
మూడు రాజధానుల ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. రాజధానుల నిధుల వ్యయం పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. పిటిషన్ తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదిస్తూ.. ఇప్పటి వరకూ రాజధాని నిర్మాణం కోసం రూ.52వేల కోట్లు ఖర్చు చేశారని పేర్కొంటూ సీఆర్డీఏ రికార్డును ధర్మాసనం ముందుంచారు. వ్యయానికి సంబంధించిన సమగ్ర వివరాలను అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. నిర్మించిన భవనాలను వాడుకోకపోతే, అవి పాడైపోతాయి కదా.. ఆ నష్టం ఎవరు భరిస్తారని ప్రశ్నించింది. రాష్ట్ర అకౌంటెడ్ జనరల్‌కు వెంటనే నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది.