ముగిసిన 48 గంటల డెడ్‌లైన్‌.. చంద్రబాబు ఏం చెప్పారంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2020 1:31 PM GMT
ముగిసిన 48 గంటల డెడ్‌లైన్‌.. చంద్రబాబు ఏం చెప్పారంటే..?

వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికల ముందు జగన్‌ ఏం చెప్పారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలను నమ్మించి ద్రోహం చేశారని, వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. మూడు రాజధానులకు ప్రజామోదం ఉందని భావిస్తే అసెంబ్లీని రద్దు చేయాలని ఏపీ సీఎం జగన్‌కు చంద్రబాబు 48 గంటల డెడ్‌లైన్‌ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ డెడ్‌లైన్‌ పూర్తి అవ్వడంతో విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

రాష్ట్ర విభజన కంటే పెద్ద అన్యాయం ఇప్పుడు జరుగుతోందన్నారు. వైసీపీ నాయకులు ఎలా మాట తప్పారో ప్రజలు తెలుసుకోవాలని, ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలన్నారు. జగన్‌, వైసీపీ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో వినిపించారు. ఏపీ రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అమరావతికి కూడా పవిత్ర నదుల నుంచి నీరు తీసుకొచ్చారని అన్నారు. అమరావతికి అండగా ఉంటామని అప్పుడే మోడీ హామీ ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రజలను మోసం చేయడం నీచమైన చర్యగా పేర్కొన్నారు. ఈ పోరాటం నా కోసమో, లేదంటే నా కుటుంబం కోసమో టీడీపీ కోసమో కాదన్నారు. ప్రజల్లో చైతన్యం, తిరుగుబాటు రావాలన్నారు. ఇష్టానుసారం ప్రవర్తించే వారికి బుద్ధి చెప్పే పరిస్థితి రావాలన్నారు.

రాజదానికి 30వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో చెప్పారా..? లేదా అని ప్రశ్నించారు. మీరు చేసే పనులు సరైనవి అనిపిస్తే ఎన్నికలకు వెళదామని సవాల్‌ విసిరారు. రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని కాపాడాలని.. కేంద్రం జోక్యం చేసుకుని రాజధానిని కాపాడాలన్నారు. అమరావతిపై ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని చెప్పారు. రాజధానిని మార్చే అధికారం వైకాపా ప్రభుత్వానికి లేదన్నారు.

Next Story