రాజధాని చుట్టూ ఏపీ రాజకీయం.. టీడీపీ, వైసీపీ నేతల రాజీనామాల సవాళ్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Aug 2020 1:06 PM GMT
రాజధాని చుట్టూ ఏపీ రాజకీయం.. టీడీపీ, వైసీపీ నేతల రాజీనామాల సవాళ్లు

ఏపీ ప్రజల భవిష్యత్‌ నాశనం చేసే అధికారం ఎవరికీ లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని సమస్య ఏ ఒక్కరితో కాదని, 5కోట్ల మంది ప్రజలదని గుర్తు చేశారు. ఏపీ రాజధాని వికేంద్రీకరణపై సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మూడు రాజధానులకు ప్రజామోదం ఉందని భావిస్తే అసెంబ్లీని రద్దు చేయాలని జగన్‌కు చంద్రబాబు సవాల్‌ విసిరారు. అందరం ప్రజల్లో తేల్చుకుందామన్నారు. ఈ విషయమై జగన్‌కు 48 గంటల సమయం ఇస్తున్నామన్నారు.

రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎంతో బాధపడ్డామని, కాంగ్రెస్ పార్టీకి నాడు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఇప్పుడు వైసీపీ అదే రీతిలో ఇష్టానుసారం ప్రవర్తిస్తోందని, ఎన్నికల ముందు మీరేం చెప్పారు, ఎన్నికల తర్వాత మీరేం చేస్తున్నారు. ఎన్నికల ముందు రాజధాని గురించి ఏమీ చెప్పకుండా ప్రజల్ని మభ్యపెట్టి, ఎన్నికల తర్వాత మూడు రాజధానులు చేస్తామంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. మీరు గనుక గెలిస్తే ఇక మేం రాజధానుల గురించి మాట్లాడమని.. అమరావతి అంశంలో మీరు ఏంచేసినా మేం నోరెత్తమనీ, కానీ ప్రజలకు చెప్పకుండా ఇలా రాజధానిపై నిర్ణయం తీసుకుంటే మాత్రం అది నమ్మించి మోసం చేసినట్టవుతుందన్నారు.

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో అమరావతిలో రాజధానికి జగన్ మద్దుతుగా మాట్లాడిని విషయాలను ఆయన గుర్తు చేశారు. జగన్‌ తీసుకున్న నిర్ణయం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ హోదాలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా అమరావతే రాజధాని అని, దీన్ని మేనిఫెస్టోలో కూడా చేర్చుతామని చాలా స్పష్టంగా చెప్పారని చంద్రబాబు వెల్లడించారు. వైసీపీకే చెందిన మరో నేత వసంత కృష్ణప్రసాద్ కూడా ఇదే తరహాలో మాట్లాడారని, అమరావతే రాజధాని అని, అందుకే మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడని, క్యాంపు కార్యాలయం, పార్టీ కార్యాలయం ఇక్కడే నిర్మించారని చెప్పారని వెల్లడించారు. తాను చేసిన సవాల్‌ను స్వీకరిస్తారా.. రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా తేల్చుకోవాలని ఆయన సవాల్‌ విసిరారు. మీకు దక్షిణాసియా ఆదర్శమా ..? అని ప్రశ్నించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.

చంద్రబాబుకు మంత్రి అనిల్‌ సవాల్‌..

మూడు రాజధానుల వివాదంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు తీవ్రతరం అవుతోంది. తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. అమరావతిపై చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు సంబంధించిన వారి భూముల చుట్టూ రాజధానిని కేంద్రీకరించారని ఆరోపించారు. అమరావతిని రియల్‌ ఏస్టేట్‌ దందాకు చంద్రబాబుకు వాడుకొన్నారని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేసిన ప్రాంతాల్లో రాజధానిని ప్రకటించారని ఆయన విమర్శించారు.

చంద్రబాబుకు దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు. ప్రభుత్వం నిర్ణయం తప్పు అంటున్న చంద్రబాబు 23మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లమని సూచించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు ఇంత గగ్గోలు పెట్టలేదు. బినామీలు నష్టపోతారని ఇప్పుడు చాలా బాధపడిపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు హైదరాబాద్‌లో సొంత ఇల్లు కట్టుకున్నారు కానీ ఏపీ‌లో ఎందుకు కట్టుకోలేదని ప్రశ్నించారు. ఇకనైనా ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై 2024లో ప్రజల తీర్పును కోరుతామన్నారు.

పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే అర్ధం కావడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్‌ మాటలపై ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు.

Next Story