బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే భారీ సవాల్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 July 2020 10:00 AM GMT
బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే భారీ సవాల్..!

ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే..! మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూడా త్వరలోనే కూలిపోవచ్చే ఊహాగానాలు కూడా వినిపిస్తున్న తరుణంలో ఉద్ధవ్‌ ఠాక్రే భారతీయ జనతా పార్టీకి సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం పూర్తి ఐదేళ్లు అధికంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేయడమే కాకుండా బీజేపీకి దమ్ముంటే తన ప్రభుత్వాన్ని కూల్చాలని సవాలు విసిరారు.

ఒకట్రెండు నెలల్లో తన ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్నారని, వారిని తన ప్రభుత్వాన్ని పడగొట్టాలని కోరుతున్నానని అన్నారు. తమ ప్రభుత్వం ఆటో రిక్షా మాదిరిగా మూడు చక్రాలతో సాగుతోందని, పేద ప్రజల కోసం స్టీరింగ్‌ తన చేతిలో ఉందని.. మరో ఇద్దరు (కాంగ్రెస్‌, ఎన్సీపీ) వెనుకనుంచి తమకు మద్దతు ఇస్తున్నారని అన్నారు ఉద్ధవ్. కేంద్రంలో ఎన్డీయే పరిస్థితి ఏంటి? వారికి ఎన్ని చక్రాలున్నాయి.. ఇంతకు ముందు నేను ఎన్డీయే సమావేశానికి హాజరైనప్పుడు వారికి రైలు తరహాలో 30-35 చక్రాలున్నాయని చెప్పుకొచ్చారు. సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్ధవ్ థాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.

చైనాతో సరిహద్దు వివాదంలో 20 మంది అమర జవాన్ల త్యాగానికి మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కానీ మనం చైనా యాప్‌లను నిషేధించి సంబరపడ్డామని కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు. చైనాతో విభేదాలపై అంతర్జాతీయ సంబంధాల విషయంలో కేంద్రానికి స్పష్టమైన వైఖరి ఉండాలని అన్నారు. ప్రస్తుతం మనం చైనాను వ్యతిరేకిస్తున్నప్పటికీ భవిష్యత్తులో అదే మనకు మిత్ర దేశంగా మారే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

ఆగస్ట్‌ 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజను నిర్వహిస్తూ ఉండగా.. అందుకు ఠాక్రే వెళతారా లేదా అన్న సందేహాన్ని నివృత్తి చేశారు. ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని ఉద్ధవ్‌ స్పష్టం చేశారు.

Next Story