జగన్ సలహాదారుడికి.. టీడీపీకి మధ్య ట్విట్టర్ వార్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 May 2020 9:37 AM GMTసామాజిక మాధ్యమాల్లో కొన్ని పార్టీల సామాజిక మాధ్యమాలకు.. కొందరు కార్యకర్తలకు మధ్య కామెంట్ల వార్ జరుగుతూ వుంటుంటుంది. ట్విట్టర్ లో పెద్ద పెద్ద నేతలకు కూడా ట్వీట్ల వార్ తప్పదు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సలహాదారుడు రాజీవ్ కృష్ణకు, తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ కు మధ్య ట్వీట్ల వార్ జరిగింది. చాలా రోజుల తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ ఓ పోస్టును పెట్టింది. దీనిపై స్పందించిన రాజీవ్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ లోకి మీకు స్వాగతం.. చాలా రోజులు అయ్యింది మీరు ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి.. మిమ్మల్ని మిస్ అయ్యాము.. అంటూ ట్వీట్ చేశారు. రాజీవ్ కృష్ణ వెటకారంగా చేసిన ట్వీట్ కు టీడీపీ ట్విట్టర్ ఖాతా నుండి వెంటనే మరో ట్వీట్ వచ్చేసింది.
ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడును బాగా మిస్ అవుతోంది నిజమే.. మీరు అడ్వైజర్ గా ఉంటూ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటూ ఉన్నారు కదా.. మీరు ప్రభుత్వానికి కంపెనీలు తీసుకుని రావడంపై ఏమని సలహాలు ఇచ్చారు. ఎన్ని కంపెనీలు వచ్చాయో తెలియజేయాలంటూ ట్వీట్ వచ్చింది.
నేను ఏమి చేశానో, ప్రభుత్వం ఏమి చేసిందో అందరికీ తెలుసు.. ఇక్కడ చెప్పాలంటే అది చాలా పెద్ద లిస్టు అవుతుంది. మీరు పసుపు రంగు కళ్ల జోడు పక్కన పెట్టేసి చూస్తే అన్నీ కనిపిస్తాయి అంటూ కౌంటర్ వేశారు రాజీవ్ కృష్ణ. చంద్రబాబు నాయుడు టూర్ కు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా.. మాకు తెలియజేస్తే సహాయం చేస్తామంటూ మరో పంచ్ వేశారు రాజీవ్ కృష్ణ.
సంవత్సర కాలంలో వైసీపీ ప్రభుత్వం చాలా హామీలను అమలు చేసిందని.. మాట ఇచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని నెరవేర్చామని.. రాబోయే కాలంలో మరిన్ని నెరవేర్చడం చూస్తారని తెలిపారు రాజీవ్ కృష్ణ.