బిగ్‌బ్రేకింగ్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Jun 2020 6:20 PM ISTతెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి నేఫథ్యంలో పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. గడిచిన విద్యా సంవత్సరం ఇంటర్నల్ పరీక్షల మార్కుల ఆధారంగా విద్యార్ధులకు గ్రేడింగ్ ఇవ్వనున్నారు.
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పది పరీక్షలపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న టెన్త్ పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక.. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు పాల్గొన్నారు.
ఇదిలావుంటే.. రాష్ట్రంలో 5,34,903 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లుండగా, అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్నిసీఎం నిర్వహించారు. ఈ సమావేశంలో టెన్త్ పరీక్షల విషయంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులను పరిశీలించారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక డిగ్రీ, పీజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.