కీలక నిర్ణయం: తెలంగాణలో సినిమా, టీవీ షుటింగ్‌లకు అనుమతి

By సుభాష్  Published on  8 Jun 2020 11:32 AM GMT
కీలక నిర్ణయం: తెలంగాణలో సినిమా, టీవీ షుటింగ్‌లకు అనుమతి

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్నవేళ.. సినిమా, టీవీ షూటింగ్‌లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతి ఇచ్చారు. సినిమా థియేటర్లకు మాత్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేశారు. రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగ్గా పాటిస్తూ షూటింగ్‌లను నిర్వహించుకోవాలని సూచించారు. అలాగే షూటింగ్‌లు పూర్తయిన తర్వాత వాటి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున సినిమా థియేటర్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి సినిమా, టీవీ షూటింగ్‌లకు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు, థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, సినీ రంగ ప్రముఖులు సమావేశమై విధివిధానాలు రూపొందించారు. మొత్తం మీద లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన సినిమా, టీవీ షూటింగ్‌లకు అనుమతులు రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story