ఇక కరోనా సోకితే ఇలా చేయండి.. కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు

By సుభాష్  Published on  7 Jun 2020 8:21 AM GMT
ఇక కరోనా సోకితే ఇలా చేయండి.. కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు

దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఎప్పటిప్పుడు మార్గదర్శకాలను విడుదల చేస్తోంది. ఆదివారం తాజాగా మరికొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటి వరకూ విడుదల చేసిన మార్గదర్శకాలకంటే ఇవి భిన్నంగా ఉన్నాయి.

కరోనా వైరస్‌ దేశంలో తీవ్రంగా ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు రోజుకు 10వేల వరకు నమోదవుతున్నాయి. కరోనా సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై ఎవరికైనా కరోనా సోకితే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లరు. ఇంట్లోనే ఉంచి చికిత్స నిర్వహిస్తారు. రోజూ వైద్యులు ఫోన్‌ చేసి ఎలా ఉంది అని తెలుసుకుంటారు. ఏయే మందులు వాడాలో వైద్యులే చెబుతారు. అప్పుడప్పుడూ వైద్యులు ఇంటికొచ్చి చూస్తారు. ఇలా మొత్తం 17 రోజుల పాటు చికిత్స ఉంటుంది. పరిస్థితి విషమించి వైరస్ మరింత పెరిగినట్లయితే అప్పుడు టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే వెంటనే వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్తారు.

ఇక కేంద్రం తెలిపిన మార్గదర్శకాల ప్రకారం..

వైరస్‌ సోకిన వారు పిల్లలు, వృద్ధులకు దూరంగా ఉండాలి

ఇక కరోనా సోకిన వారు పిల్లలకు, వృద్ధులకు దూరంగా ఉండాలి. వీలైతే వారిని ఇతర చోటికి పంపించాలి. ఇంట్లో ఉన్నవారంతా ప్రోటిన్స్‌ ఉండే ఆహారం (చికెన్‌, వేరుశనగ గింజలు, అల్లం, గుడ్లు వంటివి) తీసుకోవాలి. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లయితే టెన్షన్‌ పడొద్దని కేంద్రం తెలిపింది. అవసరమైతే టోల్‌ ఫ్రీం నెంబర్‌ 18005994455 ఫోన్‌ చేయాలి. ఇంట్లో ఉన్న రోగికి గాలి బాగా తగిలేలా చూడాలి. ప్రత్యేక బాత్‌ రూమ్‌ ఉంచాలి. అయితే కరోనా పేషంట్‌కు ఇంట్లో ఆరోగ్యంగా ఉన్నవారు సేవలు చేయవచ్చు. వైద్యుల సలహాలతో హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ టాబ్లెట్లు వాడవచ్చు. ఈ మందుల కోసం స్థానిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తెచ్చుకోవాల్సి ఉంటుంది.

అందరూ ఆరోగ్య సేతు యాప్‌ వాడాలి

అందరూ ఆరోగ్య సేతు యాప్‌ వాడాలి. కరోనా పేషంట్‌ తన గది నుంచి బయటకు వస్తే మాస్క్‌ తప్పనిసరిగ్గా ధరించాలి. తగ్గినా, తుమ్మినా రుమాలు లేదా ఇతర ఏవైన గుడ్డలాంటిది అడ్డం పెట్టుకోవాలి. ప్రతి రోజు గోరువెచ్చని నీళ్లు తాగాలి.

కరోనా సోకిన వారు ప్రోటిన్స్‌ ఆహారం తీసుకోవాలి

కరోనా సోకిన వారు ఎక్కువగా ప్రోటిన్స్‌ ఉన్న ఆహారం తీసుకోవాలి. నిగ నిరోధక శక్తి పెంచే ఆహారం తీసుకోవాలి. బ్రౌన్‌ రైస్, చిరుధాన్యాలు, బీన్స్‌, గోధుమలు వంటి ప్రోటీన్స్‌ ఉన్నవి తీసుకోవాలి. అలాగే పండ్లు, క్యారెట్‌, నిమ్మ, బత్తాయి, బీట్‌ రూట్‌ వంటివి వాడాలి. అంతేకాకుండా పసుపు, వెల్లుల్లిని కూరల్లో చేర్చుకోవాలి.

వీటికి దూరంగా ఉండాలి..

కరోనా సోకిన వారు మైదా, వేపుళ్లు, జంక్‌ ఫుడ్‌, కూల్‌డ్రింగ్‌, పామాయిల్, బట్టర్‌, ఇతర చల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలి. శుభ్రత పాటించడం తప్పనిసరి.

ఇంట్లో శానిటైజ్‌..

కరోనా సోకిన వారు ఇంట్లో దేనిని ముట్టుకున్న వెంటనే దానిని శానిటైజ్‌ చేయాలి. వైరస్‌ ఉన్న వాళ్లు తమ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. వారి బట్టలను వేడి నీటిలో డెటాల్‌ వేసి కనీసం అరగంట పాటు నానబెట్టి స్వయంగా ఉతుక్కోని ఆరేసుకోవాలి. వైరస్‌ ఎక్కువైనట్లు ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఫోన్‌ ద్వారా డాక్టర్‌కు సమాచారం అందించాలి.

ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులకు ఫోన్‌ చేయాలి

ముఖం, పెదవులు బ్లూ కలర్‌లోకి మారినా, జ్వరం ఉన్నా, గుండె నొప్పి వచ్చినా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా.. వైద్యులకు కాల్‌ చేయాలి. టెన్షన్‌ పడవద్దు. కరోనా ఉన్న వాళ్ల దగ్గరకు కుటుంబ సభ్యులు వెళ్లాలంటే యన్‌ -95 వంటి మాస్కులు ఖచ్చితంగా వాడాలి. ఆ తర్వాత మాస్కును కాల్చివేయాలి. పేషంట్‌ ఉన్న గదిలోకి వెళ్లినట్లయితే చేతులను శుభ్రంగా కడుక్కొని, శానిటైజర్‌ రాసుకోవడం తప్పనిసరి. కరోనా ఉన్న రోగి వాడే వస్తువులను కనీసం 30 నిమిషాలకు పైగా వేడి నీటిలో ఉంచి, ఆ తర్వాత శుభ్రంగా కడిగి వాడుకోవచ్చు.

చుట్టుపక్కల వాళ్లు టెన్షన్‌ పడొద్దు..

కరోనా సోకిన వ్యక్తులు ఇంటి ఉన్నట్లయితే చుట్టుపక్కల వాళ్లు టెన్షన్‌ పడొద్దు. ఎవరికి వాళ్లు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన వాళ్లు ఒక వేళ బయటకు వెళ్లినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలి. వారి చేతులపై ఉండే ముద్ర ఆధారంగా వాళ్లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

ప్రజల నుంచి వచ్చే ప్రశ్న..

అయితే తాజాగా కేంద్రం విడుదల చేసిన ఈ మార్గదర్శకాలు కొత్తగా ఉండవచ్చు. ఇలాంటివి అమెరికా, ఇంగ్లండ్‌ వంటి దేశాల్లో ఇప్పుడు ఇలానే చేస్తున్నారు. ఇతర దేశాల్లో అయితే పెద్ద గదులు, ఖాళీ స్థలం చాలా ఉంటుంది. ఇక మనకైతే ఒకటి, రెండు గదులు మాత్రమే ఉంటాయి. ఖాళీ స్థలం అనేది ఉండదు. ఇంకొందరికైతే ఒకే గది, ఒకే బాత్‌ రూమ్‌ ఉంటుంది. అలాంటి సమయంలో ఇలాంటి నిబంధనలు పాటించడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తం అవుతోంది.

Next Story