మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Aug 2020 1:35 PM GMTవైన్ షాపుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటి వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు మాత్రమే మద్యాన్ని విక్రయించాలనే నిబంధనను అమలు చేశారు. తాజాగా అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా వైన్ షాపులపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశారు. దీంతో వైన్ షాపులు తెరిచి ఉంచే వేళల్లో మార్పులు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో లాక్‌డౌన్ విధింపునకు ముందుగా ఉన్న టైమింగ్సే ఇప్పుడూ కొనసాగనున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు వైన్ షాపులు తెరిచి ఉంచేవారు. తాజాగా ఉత్తర్వులతో గతంలో మాదిరిగానే షాపులు తెరుచుకోనున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో మద్యం అమ్మకాలపై అప్పుడు పూర్తిగా నిషేధం విధించారు. కొద్ది రోజుల తర్వాత సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరిపేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
మరికొన్ని రోజులు గడిచాక వైన్ షాపులు వేళలను స్వల్పంగా పెంచుతూ నిర్ణయించారు. తాజా ఉత్తర్వులతో ఉన్న పరిమితులన్నింటినీ ఎత్తివేశారు. దీంతో రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా వైన్ షాపులు ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు తెరుచుకునేలా ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.