అత్యాచారం ఆలోచనే రానివ్వని శిక్షలు అవసరం - పవన్ కళ్యాణ్

JanaSena Party Chief Pawan Kalyan Reacts On Rape Incidents

By -  Nellutla Kavitha |  Published on  6 Jun 2022 1:13 PM GMT
అత్యాచారం ఆలోచనే రానివ్వని శిక్షలు అవసరం - పవన్ కళ్యాణ్

ఆడ బిడ్డపై అత్యాచారాలను నిరోధించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న శిక్షలే కాకుండా, అటువంటి ఆలోచనలు మృగాళ్లకు రాకుండా సంస్కరణలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని అన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. చట్టసభ సభ్యులు, మేధావులు, సంఘ సంస్కర్తలపై ఆ బాధ్యత ఎంతగానో ఉందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ఈమధ్య కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న సంఘటనలు మరోసారి హెచ్చరిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో తరచూ అత్యాచార ఘోరాలు జరుగుతూనే ఉన్నాయని, దీంతో పాటు ఇటీవల జరిగిన దిశ అత్యాచార ఘటన మరవకముందే, ఈ వారంలో హైదరాబాదులో ఒక మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం తీవ్రంగా కలిచివేసిందని ఆయన అన్నారు. ఈ వారంలో హైదరాబాదులో కొందరు మైనర్ బాలురు, వారు ప్రయాణిస్తున్న కారులో అత్యాచారానికి పాల్పడటం మాటలకు అందని దుర్మార్గంగా ఆయన అభివర్ణించారు. అల్లారుముద్దుగా పెంచుకునే పిల్లలపై ఎవరైనా ఒక దెబ్బ వేస్తేనే తల్లిదండ్రులు అల్లాడి పోతారని, ఆవేదనకు గురవుతారని, అలాంటిది ఒక సమూహమే ఆ బాలికను చెరపడితే, ఆ బాలికతో, పాటుగా తల్లిదండ్రులు ఎంత కుమిలిపోయి ఉంటారో, ఎంత క్షోభ పడివుంటారో ఊహించగలనని అన్నారు పవన్ కళ్యాణ్.

ఈ కేసులో ఏ ఒక్క దోషి తప్పించుకోవడానికి వీలు వుండకూడదని, ముద్దాయిలు చిన్న వారైనా, పెద్ద వారైనా, పలుకుబడి ఉన్న వారైనా, చట్టం ముందు నిలబెట్టాలని, దోషులకు శిక్ష పడినా, అత్యాచారానికి బలైన ఆ బాలికకు ఆమె కుటుంబానికి న్యాయం జరిగిందని భావించకూడదు అని అన్నారు పవన్ కళ్యాణ్. బాలికకు, బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలని, దోషుల కుటుంబాల నుంచి భారీగా నష్టపరిహారం రాబట్టి బాధితులకు, బాధితురాలికి అందజేయాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. బాధితురాలు నిలదొక్కుకొని సామాన్య జీవితం కొనసాగించడానికి తెలంగాణ మంత్రివర్యులు, నవ తరం నాయకులు కేటీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నా అని అన్నారు పవన్ కళ్యాణ్.

Next Story