హైదరాబాద్‌లో గోడ కూలి ముగ్గురు చిన్నారుల మృతి
By అంజి Published on 28 Feb 2020 8:53 AM IST
ముఖ్యాంశాలు
- హబీబ్‌నగ్ పీఎస్ పరిధిలో విషాదం
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- మృతదేహాలు ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. గురువారం రాత్రి మంగర్ బస్తీలోని అప్జల్ సాగర్ వీధిలో ఉన్నట్టుంది ఒక్కసారిగా ప్రహరీ గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు నిద్రిస్తుండగానే దుర్మరణం చెందారు. మృతులు వివరాలు.. రోషిని (6), పావని(4), సారిక(4). ఈ ఘటనతో అప్జల్ సాగర్ వీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారులు ఇంట్లో నిద్ర పోతుంటే.. పెద్దవాళ్లు ఇంటి బయట కూర్చొని మాట్లాడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మరో చిన్నారి మూడేళ్ల గీత తీవ్రంగా గాయపడగా వెంటనే ఆస్పత్రికి తరలించారు.
స్థానికులు సమాచారం మేరకు పోలీసులు, క్లూస్ టీమ్, జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ టీమ్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. చిన్నారుల మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. కన్నబిడ్డలు తిరిగిరానిలోకాలకు వెళ్లిపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పసిపిల్లలతో కళకళాడాల్సిన ఆ ఇళ్లు ఇప్పుడు మూగబోయింది.