హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుట్టిన రోజంటూ పిలిచి మహిళపై అఘాయిత్యం చేసేందుకు నలుగురు యువకులు యత్నించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్‌లోని ఓ మహిళ ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా పని చేస్తోంది. కాగా డెయిరీఫాం చౌరస్తా వద్ద నివాసం ఉండే ఓ యువకుడు తన పుట్టిన రోజు వేడుకలు అని చెప్పి, వాటి నిర్వహణ బాధ్యతల కోసం ఆ మహిళతో ఒప్పందం చేసుకున్నాడు.

ఈ క్రమంలో గత శనివారం రోజు రాత్రి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అనంతరం వేడుకలు ముగిసాక.. అమీర్‌ తన స్నేహితులు రజత్‌ అలీ, సల్మాన్‌లతో కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఆ మహిళను డ్యాన్స్‌ చేయాలంటూ బలవంతం చేశారు. తనకు డ్యాన్స్‌ రాదని ఎంత మొత్తుకున్న ఆ యువకులు వినలేదు. ఆ మహిళను ఓ గదిలో బంధించారు. ఆ తర్వాత మహిళను కత్తులతో బెదిరించి, వివస్త్రను చేసి బలవంతంగా డ్యాన్స్‌ చేయించారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాగొలా తప్పించుకున్న బాధిత మహిళ జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పింది.

భర్త సాయంతో బాధిత మహిళ ఈ నెల 23న రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ ఘటన జరిగిన రోజునా నిందితులతో పాటు మరో మహిళ ఉందని బాధితురాలు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని ఏసీపీ అశోక్‌ చక్రవర్తి తెలిపారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.