కరోనా తెచ్చిన కష్టం.. శిశువును కాలువలో పడేశారు
By తోట వంశీ కుమార్ Published on 19 July 2020 12:34 PM ISTకరోనా వైరస్ పేరు చెబితే వణికిపోతున్నారు. ఈ మహమ్మారి వల్ల కనీసం కడచూపునకు నోచుకోని పరిస్థితులు ఉన్నాయి. మానవత్వం మంటగలుస్తోంది. ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. పుట్టిన వెంటనే శిశువు మరణించింది. బిడ్డ మృతదేహాన్ని గ్రామానికి తీసుకువస్తామని అడిగితే గ్రామ పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో ఆ మృతశిశువును కాలువలో పడేసి వెళ్లారు. ఈ ఘటన హృదయ విదారకర ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం కోటపాడులో చెందిన మదార్‌బీ, షాంషావలీ దంపతులు నివసిస్తున్నారు. శుక్రవారం నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో మదార్ బీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. పుట్టిన కాసేపటికే ఆశిశువు మృతి చెందింది. శిశువు మృతదేహాన్ని ఖననం చేసేందుకు గ్రామంలోకి తీసుకువస్తామని షాంషావలీ గ్రామపెద్దలను కోరగా.. ఆస్పత్రిలో కరోనా రోగులు ఉంటారని, మృతదేహాన్ని ఊళ్లలోకి తీసుకువస్తే.. వైరస్ తమకు సోకుతుందేమోనని భయంతో వారు ఒప్పుకోలేదు. దిక్కుతోచని స్థితిలో షాంషావలీ తన ఊరికి వెళ్లే దారిలో కేసీ కెనాల్‌లో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు. కాలువలో శిశువు మృతదేహాన్ని గమనించిన స్థానికులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. చేతికి ఉన్న ట్యాగ్ ఆధారంగా.. షాంషావలీకి సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి మృతదేహాన్ని తీసుకువెళ్లారు.