వ‌ర‌వ‌ర‌రావును విడుద‌ల చేయాలి :‌ ఉప ‌రాష్ట్ర‌ప‌తికి ఏపీ ఎమ్మెల్యే లేఖ‌.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 July 2020 7:02 AM GMT
వ‌ర‌వ‌ర‌రావును విడుద‌ల చేయాలి :‌ ఉప ‌రాష్ట్ర‌ప‌తికి ఏపీ ఎమ్మెల్యే లేఖ‌.!

సంబంధం లేదన్నట్లు కనిపిస్తారు కానీ.. ఊహించని రీతిలో అనుబంధాలు కొన్ని బయటకు వస్తుంటాయి. తాజాగా అలాంటి అనుబంధమే ఒకటి బయటకు వచ్చింది. విరసం నేతగా సుపరిచితులైన వరవరరావును కాపాడాలంటూ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయడుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా వరవరరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

వివిధ ఆరోపణలతో జైల్లో ఉన్న ఆయన.. ఇటీవల కాలంలో పలుమార్లు అస్వస్థతకు గురి కావటమే కాదు.. రెండు రోజుల క్రితం కరోనా బారిన పడటం తెలిసిందే. వయసు మీద పడటం.. జైల్లో ఇబ్బందులు పడుతున్న ఆయన్ను మానవీయ కోణంలో విడుదల చేయాలని కోరుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వరవరరావుతో తనకున్న అనుబంధాన్ని హార్ట్ టచ్చింగ్ గా రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది.

48 ఏళ్ల క్రితం తనలోని రాజకీయ ఆలోచనల అంకుర్బావ దశలో తనకు లభించిన ఎందరో గురువుల్లో వరవరరావు ఒకరని పేర్కొన్నారు. తాను.. వరవరరావు ఇద్దరం ఎమర్జెన్సీ సమయంలో ఇరవై ఒక్క నెలల పాటు జైల్లో కలిసి ఉన్నామని గుర్తు చేసుకున్నారు. రాజకీయ సిద్ధాంతంలోనూ.. జనక్షేమం విషయానికి సంబంధించి నడిచే మార్గంలో ఎవరి భావాలు వారివేనన్న ఆయన.. ‘‘మనం మనుషులం. శరీరం మంచానికి కట్టుబడే 81 ఏళ్ల వయసులో.. అందునా అనారోగ్యంతో ఉన్న ఆయనపై ప్రభుత్వం దయ చూపాల్సిన అవసరం ఎంతో ఉంది’’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కోరారు.

53 ఏళ్లుగా అడవుల్లో ఆయుధాలు పట్టుకొని తిరుగుతున్న సాయుధులు సాధించలేని విప్లవం.. మంచం పట్టిన పెద్ద వయస్కుడు సాధిస్తాడా? అని ప్రశ్నించిన భూమాన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనను నిర్బంధంలో ఉంచటం అవసరమా? అని సూటిగా ప్రశ్నించారు. రాజ్యం ఇంత కాఠిన్యమా? న్యాయం ఇంత సుదూరమా? అని ఏ మేధావి ఈ దేశంలో భావించకూడదన్నారు. శత్రువులను సైతం క్షమించాలని.. వేదాంత వారసత్వ భారతదేశ ఉప రాష్ట్రపతి స్థానంలో ఉన్న మీరు.. వరవరరావు విడుదల విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాని కోరారు.

చదివినంతనే టచ్ చేసేలా ఉన్న ఈ లేఖ.. ఇంతకు ముందే రాయటమే కాదు.. తమకున్న అన్ని మార్గాల్లో ప్రయత్నించి ఉంటే.. మరింత బాగుండేదన్న మాట వినిపిస్తోంది. గురువుగా ఉన్న అనుబంధాన్ని మరికాస్త ముందుగా ప్రయత్నాలు చేసి ఉంటే వరవరరావుకు మేలు జరిగి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూమాన లేఖపై ఉపరాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న వెంకయ్య ఎలా స్పందిస్తారో చూడాలి.

Next Story