ఇంట్లో దాక్కున్న ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Jun 2020 10:37 AM GMTశ్రీనగర్ లోని జదిబాల్ సౌరా ప్రాంతంలో ముగ్గురు తీవ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. తీవ్రవాదులు ఆ ప్రాంతం లోని ఓ ఇంట్లో దాక్కున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు, సైనికులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. సరెండర్ అవ్వాలంటూ కోరినప్పటికీ వారు భద్రతా దళాల మాట వినలేదు. దీంతో సైనికులు వారిని మట్టుబెట్టారు.
ముగ్గురు తీవ్రవాదుల్లో ఇద్దరు 2019 నుండి తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారు. రెండు నెలల కిందట బిఎస్ఎఫ్ జవాన్ల మీద జరిగిన దాడిలో ఒక తీవ్రవాది ప్రమేయం ఉందని అధికారులు తెలిపారు.
ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం భద్రతా దళాలు ఈరోజు ఉదయం.. కొన్ని ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ను మొదలుపెట్టారు. అలా ఆ ప్రాంతం లోని ఇంటి వద్దకు వెళ్ళగానే తీవ్రవాదులు కాల్పులు చేయడం మొదలుపెట్టారు. వెంటనే భద్రతా దళాలు ధీటుగా బదులిచ్చాయి.
మొదట వారిని లొంగిపొమ్మని కోరడానికి భద్రతా దళాలు తీవ్రవాదుల తల్లిదండ్రులను అక్కడికి పిలిపించాయి. లొంగిపొమ్మని తల్లిదండ్రులు కోరినా కూడా వారు వినిపించుకోలేదు. భద్రతాదళాలు చివరికి వారిని మట్టుబెట్టాయి. ముందు జాగ్రత్త చర్యగా శ్రీనగర్ లో మొబైల్ ఇంటర్ నెట్ ను ఆపివేశారు. మొత్తం అలర్ట్ ప్రకటించాయి భద్రతాదళాలు.