కేసీఆర్‌.. రేవంత్‌ను అపాయింట్‌మెంట్ అడుగు.. ఇస్తారు : జ‌గ్గారెడ్డి

కేసీఆర్.. ప్రజా క్షేత్రంలోకి వస్తా అని అన్నారు కానీ ఇంట్లో కూర్చొని మీడియాలో ప్రకటనలు ఇవ్వడానికే పరిమితమయ్యారని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి అన్నారు

By Medi Samrat  Published on  30 Aug 2024 2:48 PM IST
కేసీఆర్‌.. రేవంత్‌ను అపాయింట్‌మెంట్ అడుగు.. ఇస్తారు : జ‌గ్గారెడ్డి

కేసీఆర్.. ప్రజా క్షేత్రంలోకి వస్తా అని అన్నారు కానీ ఇంట్లో కూర్చొని మీడియాలో ప్రకటనలు ఇవ్వడానికే పరిమితమయ్యారని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి అన్నారు. ఆయ‌న గాంధీ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్లలో నేరుగా ప్ర‌జ‌ల్లోకి ఎప్పుడైనా వెళ్ళారా..? అని ప్ర‌శ్నించారు. సీఎంగా ప్రజలతో కలవలేదు.. ప్రతిపక్ష నేతగా కూడా ప్రజల్లోకి వెళ్ల‌టం లేదు.. కేసీఆర్ సభలకే పరిమితం అయ్యార‌ని అన్నారు. తొమ్మిదిన్నర ఎండ్లలో రుణమాఫీ విడతల వారీగా చేయొద్దని.. రైతులు ఇబ్బంది పడుతున్నారు అని కాంగ్రెస్ ఆందోళన చేసింది.. రైతులతో కలిసి మా పీసీసీ చీఫ్ లు పని చేశారు.. పీసీసీ.. సీఎల్పీ ఆనాడు రైతుల సమస్యలపై పోరాటం ఆపలేదన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో సచివాలయంలో సీఎం, మంత్రులు అందుబాటులో ఉన్నారని అన్నారు.

తొమ్మిదిన్నర ఏండ్లలో సీఎం హోదాలో కేసీఆర్ సచివాలయంలో ఎన్ని రోజులు కూర్చున్నారో.. 9 నెలల్లో రేవంత్ ఎన్ని రోజులు సచివాలయంలో ఉన్నారో లెక్క తేల్చుద్దాం.. బీఆర్ఎస్‌ నేతలు అందుకు సిద్ధమా? అని స‌వాల్ విసిరారు. కేసీఆర్ ప్రకటన చేస్తే.. వాటికి ఎప్పుడైనా విలువ ఉందా? కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా మాటకు కట్టుబడి ఉన్నారా..? అని ప్ర‌శ్నలు సంధించారు. చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే.. ప్రజలు మాకెందుకు అధికారం ఇస్తారని ప్ర‌శ్నించారు. సీఎం రేవంత్.. కేసీఆర్ ను అసెంబ్లీకి రండి.. మాకు సలహాలు సూచనలు ఇవ్వండి అని అడిగారు.. అయినా రాలేదన్నారు

తెలంగాణలో రివర్స్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్నారు. అసెంబ్లీ పెడితే.. ప్రతిపక్ష నాయకుడు వస్తారు.. సీఎంలు సరిగా రారు.. కానీ తెలంగాణలో సీఎం రేవంత్.. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ను సభకు రండి అని పిలిచే పరిస్థితి వచ్చిందన్నారు. బయట మాట్లాడే కేసీఆర్.. సభలోకి వచ్చి రుణమాఫీ గురించి మాట్లాడొచ్చు కదా.? అసెంబ్లీ పెట్టండి సమస్యలపై మాట్లాడాలి అని ప్రతిపక్ష నాయకుడు అడగాలి.. కానీ సీఎం అసెంబ్లీ పెట్టి ప్రతిపక్ష నాయకుడిను సభకు రండి అని పిలిచే పరిస్థితి నెల‌కొంద‌ని అన్నారు.

సీఎంగా సచివాలయం రాలేదు.. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ కి కూడా రావడం లేదు.. కేసీఆర్‌.. రేవంత్‌ను అపాయింట్ మెంట్ అడుగు.. ఇవ్వడా.. సచివాలయం వెళ్లి సమస్యలపై చర్చ చెయ్‌.. సీఎం అందుబాటులో లేరా.. మీ హయంలో ప్రతిపక్ష నాయకులకు అపాయింట్ మెంట్ ఇవ్వలేని పరిస్థితి.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.

రుణమాఫీ మేము ఇచ్చిన మాట ప్రకారం 9 నెలల్లో చేశామ‌న్నారు. రుణమాఫీ కోసం 12 వేల కోట్లు నిధులు రెడీగా ఉన్నాయన్నారు. సమస్య 2 లక్షల రుణాల విషయంలోనేన‌న్నారు. కేసీఆర్ తొమ్మిదిన్నర యేండ్లలో సిస్టం అంతా ఖరాభ్ చేశారు. ప్రభుత్వానికి.. బ్యాంకర్లకు మధ్య ఆన్లైన్ సిస్టం దెబ్బ తీశారు కేసీఆర్.. అందుకే ఆలస్యం అన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల విధానం కూడా కేసీఆర్ దెబ్బతీశారన్నారు. ఇంటింటి సర్వే చేస్తున్నది సర్కార్..సెప్టెంబర్ నెలాఖరు వరకు అందరికీ మాఫీ ఐపోతుందన్నారు.

హరీష్ రావు అధికారం మజాలో ఉన్నాడని.. హరీష్ కి లెక్కలే రావు.. ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడని ఎద్దేవా చేశారు. మేన మామ చెప్పింది చేయడమే హరీష్ రావు పని అన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ వస్తారు.. అసలు సంబరాలు అక్కడ చేస్తామ‌న్నారు. రాహుల్ గాంధీని కొడంగల్ రా.. ఇటు రా అనే స్థాయా నిదీ.. సిద్దిపేటలో రైతులు లేరా.? మా స్టేట్ లీడర్స్ లేరా.. రాహూల్ గాంధీ కావాలా..? కోదండ రెడ్డి.. అన్వేష్ రెడ్డిలను సిద్దిపేట పంపిస్తాం.. ఏం కావాలో చెప్పుకో అన్నారు. రాహుల్ గాంధీ గురించి మళ్ళీ మాట్లాడితే.. నా లాంగ్వేజ్ మారుస్తా అని హెచ్చ‌రించారు.

Next Story