తలుపు తడితే చాలు ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తారు : రేవంత్ రెడ్డి
TPCC president Revanth Reddy said that Sonia Gandhi is the only leader of Telangana people. తెలంగాణ ప్రజలకు ఏకైక నాయకురాలు సోనియాగాంధీ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 14 Jun 2023 9:53 AM GMTTPCC president Revanth Reddy said that Sonia Gandhi is the only leader of Telangana people
తెలంగాణ ప్రజలకు ఏకైక నాయకురాలు సోనియాగాంధీ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీహరి రావ్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నోముల ప్రకాష్ గౌడ్ లతో పాటు వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు గాంధీభవన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతగా రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన శ్రీహరి రావుకి సాదర స్వాగతం పలికారు. నిర్మల్ జిల్లా నుంచి కాంగ్రెస్ కుటుంబంలో చేరిన వారికి సముచిత గౌరవం, స్థానం దక్కుతుందని భరోసా ఇచ్చారు. పార్టీ గెలుపు కోసం పనిచేసేవారికి గుర్తింపు లభిస్తుందన్నారు.
కొందరు పార్టీ వీడితే నాయకులే ఉండరన్నట్లు వ్యవహరించారని.. కానీ అంతకంటే బలమైన నాయకులు పార్టీలోకి వచ్చారని అన్నారు. ఖచ్చితంగా నిర్మల్ అసెంబ్లీలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్ లో గెలవడం ఎంత ముఖ్యమో.. నిర్మల్ నియోజకవర్గంలో గెలవడం అంతే ప్రాధాన్యతగా తీసుకుంటామన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ఉన్నా నిర్మల్ లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించలేకపోయారని అన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నేను సవాల్ విసురుతున్నా.. ఏ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించారో.. ఆ గ్రామంలో బీఆర్ఎస్ ఓట్లు అడగాలి.. ఇందిరమ్మ ఇల్లు కట్టిన ప్రాంతాల్లో మేం ఓట్లు అడుగుతాం.. ఇందుకు ఇంద్రకరణ్ రెడ్డి సిద్ధమా? అని అన్నారు.
కేసీఆర్ మోసాన్ని భరించే ఓపిక తెలంగాణ ప్రజలకు లేదని అన్నారు. తెలంగాణ సమాజం తిరగబడే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. కేసీఆర్ చేతిలో మోసపోయినవారి జాబితాలో శ్రీహరి రావు మొదట్లో ఉంటారని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. నిర్మల్ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో 10కి కనీసం 8 సీట్లు గెలిపించుకోవాలి. ఒక నిశ్శబ్ద విప్లవం, ఒక తుఫాన్ రాబోతుందని జోష్యం చెప్పారు. నాయకులు గ్రామాల్లోకి వెళ్లి ప్రతీ గుండెకు చేరాలని.. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ప్రేమ ఉందని అన్నారు.
తలుపు తడితే చాలు ప్రజలు కాంగ్రెస్ ను గెలిపిస్తారని ఘంటాపథంగా చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి, ప్రజలకు మధ్య యుద్ధం జరగబోతోందని.. ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఒడిస్తారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బండకేసి కొడతారని అన్నారు. శ్రీహరి రావుకు పీసీసీ అధ్యక్షుడుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.