'ఉచిత విద్యుత్' కాంగ్రెస్ పేటెంట్ 'స్కీమ్' - రేవంత్ రెడ్డి
TPCC Leader Revanth Reddy Fire On CM KCR. దేశ ఐక్యక, భారత సమగ్రత కోసం, పేద మధ్య తరగతి ప్రజల కోసం పోరాడుతోన్న రాహుల్ గాంధీపై మోదీ ప్రభుత్వం కక్షగట్టి
By Medi Samrat Published on 11 July 2023 2:30 PM GMTదేశ ఐక్యక, భారత సమగ్రత కోసం, పేద మధ్య తరగతి ప్రజల కోసం పోరాడుతోన్న రాహుల్ గాంధీపై మోదీ ప్రభుత్వం కక్షగట్టి ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేసిన వైఖరిని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు రేపు (బుధవారం) టీపీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా “సత్యాగ్రహ దీక్ష” పేరుతో గాంధీజీ విగ్రహాల వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధమైన సందర్భంలో అసత్య, అసందర్భ అంశాన్ని తెర మీదకు తెచ్చి బీఆర్ఎస్ చిల్లర హడావుడి చేయడం, సత్యాగ్రహ దీక్షను నీరుగార్చే కుట్ర అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఇటీవల ఖమ్మంలో జరిగిన తెలంగాణ జన గర్జన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ అన్నది బీజేపీకి B టీంగా మారిందని ఆరోపించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక ఈ B టీం బంధం ఫెవికాల్ బంధంగా బలపడిందని రేవంత్ ఆరోపించారు. మోదీకి వ్యతిరేకంగా జరుగుతోన్న సత్యాగ్రహ దీక్షను భగ్నం చేసే కుట్రలో భాగంగా బీజేపీ B టీం అయిన బీఆర్ఎస్.. అమెరికాలో తాను అనని మాటలను అన్నట్టు దుష్ర్ఫచారంలోకి తెచ్చి మోదీని కాపాడే ప్రయత్నం చేస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అన్న విషయం తేలిపోవడంతో బీఆర్ఎస్ మంత్రులు, నేతలు దుష్ప్రచారాలకు తెగబడ్డారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్ లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడం, ఈ డిక్లరేషన్ రైతుల్లో భరోసా నింపడంతో వెన్నులో వణుకుపుట్టిన బీఆర్ఎస్ చిల్లర ప్రచారాలతో లబ్ధిపొందే కుతంత్రానికి దిగిందన్నారు.
బీఆర్ఎస్ సర్కారు రైతులకు 12 గంటలు కూడా నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని.. 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు రైతులను మోసం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. దీనికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయాల్సిందిగా శ్రేణులకు పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను రూ.60 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టి, అవినీతితో వాటిని దివాళా తీయించిన ఘనత కేసీఆర్ దేనన్నారు. దీనిపై అమరవీరుల స్థూపం వద్ద చర్చకు తాను సిద్ధమని.. కేసీఆర్ అండ్ కో కూడా సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు.
మళ్లీ అధికారం కోసం బీఆర్ఎస్ ఎంత ఆరాటపడినా వారిది దింపుడు కళ్లెం ఆశే తప్ప ప్రయోజనం ఉండదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వరంగల్ లో రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రకటించిన ఏకకాలంలో రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ, భూమి ఉన్న రైతులు, కౌలు రైతులకు ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం , ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్న భూమి లేని రైతులకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు తదితర పంట లకు మెరుగైన గిట్టుబాటు ధర.. రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోళ్లు, మూసివేసిన చెరుకు కర్మాగారాలను తెరిపించేందుకు చర్యలు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి రెండు పంటలు పండించే రైతులకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు, మెరుగైన పంటల బీమా పథకం అమలు. శరవేగంగా నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందించేలా ఏర్పాట్లు. రైతుకూలీలు, భూమి లేని రైతులకు కూడా రైతు బీమా వర్తింపు, వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం, పోడు భూములు, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల కల్పన, రైతుల పాలిట శాపంగా మారిన ’ధరణి’ పోర్టల్ రద్దు. అన్ని రకాల భూములకు రక్షణ కల్పించే విధంగా సరికొత్త రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు, రైతుల ఆత్మహత్యలకు కారణమైన నకిలీ విత్తనాలు, పురుగు మందుల విక్రేతలపై కఠిన చర్యలు, పీడీ యాక్ట్ కింద కేసులు. సదరు సంస్థలు, వ్యక్తుల ఆస్తులను జప్తు చేసి నష్టపోయిన రైతులకు అందించేలా నిబంధనలు, అవినీతికి తావు లేకుండా నిర్దిష్ట కాల పరిమితిలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, రైతు హక్కుల పరిరక్షణ కోసం చట్టపరమైన అధికారాలతో ‘రైతు కమిషన్’ ఏర్పాటు, భూముల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగిన పంటల ప్రణాళిక. వ్యవసాయాన్ని పండుగగా మార్చేలా ప్రణాళికలు లాంటి హామీలకు కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించింది. ఇప్పటికే రైతుల విశ్వాసం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి ఈ డిక్లరేషన్ వెన్నులో వణుకు పుట్టించింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో తాను మాట్లాడిన మాటలపై కోడిగుడ్డు పై ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఉచిత విద్యుత్ అన్నది కాంగ్రెస్ పేటెంట్ స్కీం. 24 గంటల ఉచిత విద్యుత్ ముసుగులో రైతులను మోసం చేస్తోన్న కేసీఆర్ అండ్ కోకు కాంగ్రెస్ ను వేలెత్తి చూపించే అర్హత లేదని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ మంత్రులు, నాయకుల చిల్లర ప్రయత్నాలకు ఒక మీడియా చానెల్ వత్తాసు పలకడం, వారితో అంటకాగి తమపై దుష్ర్పచారం చేయడంపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తో పాటు ఆ ఛానెల్ బాగోతం ఏమిటన్నది కూడా బయటపెడతానని స్పష్టం చేశారు.