తెలంగాణలో కోట్లాది రూపాయల భూములను కొల్లగొట్టింది బీఆర్ఎస్ నాయకులు..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల వేలం వివాదంపై విద్యార్థులు ఆందోళనలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల భూములపై సర్వే చేయించి కబ్జాలకు గురైన వాటిని కాపాడాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా. లెక్కలు తీస్తే బొక్కలు విరుగుతాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కోసం ఇందిరాగాంధీ 2500 ఎకరాలు ఇచ్చింది. కేటీఆర్, కిషన్ రెడ్డి చేతిలో చెయ్యేసి చెప్పు బావ అనేలా వ్యవహరిస్తున్నారు. రామేశ్వరరావు కన్ను హెచ్‌సీయూ భూములపై పడింది. కోర్టులో ఉన్న కారణంగా భూములను కొల్లగొట్టలేకపోయారు..అని మహేశ్ కుమార్ ఆరోపించారు.
హెచ్‌సీయూ అన్యాక్రాంత భూముల్లో మై హోం విహంగ బిల్డింగ్ వెలిసింది. సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూముల్లో మై హోం బిల్డింగులు నిర్మించారు. అప్పుడు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు. గత ప్రభుత్వంలో అక్కడ రోడ్లు వేశారు. కేసీఆర్ బినామీలకు భూములు ఇచ్చేటప్పుడు వన్య ప్రాణులు కనపడలేదా? అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. 534 ఎకరాలు ప్రభుత్వం తీసుకున్నందుకు గోపనపల్లిలో 397 ఎకరాల భూమిని యూనివర్సిటీకి కేటాయించారు. విద్యార్థులను రెచ్చగొట్టి కేటీఆర్ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు...అని టీపీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.