ఎన్నికలు రాగానే దర్యాప్తు సంస్థలను వాడడం వాళ్లకు అలవాటైంది: టీపీసీసీ చీఫ్
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై అక్రమ కేసులు నమోదు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik
ఎన్నికలు రాగానే దర్యాప్తు సంస్థలను వాడడం వాళ్లకు అలవాటైంది: టీపీసీసీ చీఫ్
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై అక్రమ కేసులు నమోదు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్లు నమోదు చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ గన్‌పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ ర్యాలీ చేపట్టింది. ఈ కార్యక్రమంలో మహేష్ కుమార్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన నడుస్తుంది. రాహుల్‌గాంధీకి పెరుగుతున్న ఇమేజ్ ఓర్వలేక మోడీ సర్కార్ అక్రమ కేసుల కుట్రలకు తెరలేపింది. తెలంగాణ ప్రజలకు నిజాలకు తెలియాలనే ధర్నా చేపట్టాం. కాంగ్రెస్ పార్టీ పేపర్ అయిన నేషనల్ హెరాల్డ్ పేపర్‌కు రూ.90 కోట్లు రుణం ఇస్తే మనీలాండరింగ్ జరిగినట్లు ఎలా అవుతుంది? మనీలాండరింగ్ కేసు కక్ష సాధింపు చర్యే. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగలేదు..అని మహేశ్ కుమార్ పేర్కొన్నారు.
మోడీ హవా తగ్గుతున్న క్రమంలో రాహుల్ గాంధీ ఇమేజ్‌ను బద్నాం చేసేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. గాంధీ కుటుంబం ఏనాడూ కేసులకు భయపడింది లేదు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నవారు బీజేపీ పార్టీలో ఒక్కరూ లేరు. మోడీకి కనువిప్పు కలిగేలా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహిస్తుంది. రాహుల్ గాంధీ ఒక ఫైటర్, దేశ ప్రజాగొంతుక రాహుల్ గాంధీ. రాహుల్ సంకల్పం ముందు ఈ కుట్రలు, అక్రమ కేసులు బలాదూర్. కులగణనతో రాహుల్‌గాంధీ మోడీకి రాజకీయ మరణ శాసనం రాశారు. బిహార్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఎన్నికలు రాగానే ప్రతిపక్షాలపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడడం మోడీ, అమిత్ షాలకు అలవాటుగా మారింది. గుజరాత్‌లో ఏఐసీసీ సమావేశాలతో బీజేపీ నేతల్లో వణుకు మొదలైంది...అని టీపీసీసీ చీఫ్ ఎద్దేవా చేశారు.