టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదు
పండగుల నేపథ్యంలో బస్సు టికెట్ చార్జీలను పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది.
By - Medi Samrat |
పండగుల నేపథ్యంలో బస్సు టికెట్ చార్జీలను పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది. టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ప్రధాన పండుగల సమయాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే సర్వీసులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరలను సంస్థ సవరిస్తుందని పేర్కొంది. స్పెషల్ బస్సుల్లో మాత్రమే సాధారణ చార్జీలో 50 శాతం వరకు సవరణ అమల్లో ఉంటుందని వివరించింది. టీజీఎస్ఆర్టీసీలో 2003 నుంచి ఈ పద్దతి ఆనవాయితీగా వస్తోందని, ఇప్పుడే స్పెషల్ బస్సుల్లో కొత్తగా చార్జీలను సవరణ చేస్తున్నట్లు కొందరు దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికింది.
ప్రధాన పండుగులైన సంక్రాంతి, దసరా, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, ఉగాది, తదితర సమయాల్లో హైదరాబాద్ నుంచి ప్రయాణికులు ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తుంటారు. ఈ సందర్బాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నడుపుతుంది. రద్దీ మేరకు హైదరాబాద్ సిటీ బస్సులను కూడా జిల్లాలకు తిప్పుతుంది. తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ ఉండకపోవడంతో ఖాళీగా ఆ బస్సులు వెళ్తుంటాయి. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండుగల సమయాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 50 శాతం వరకు టికెట్ ధరను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది.
టీజీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం 10 వేల వరకు బస్సులు సేవలందిస్తున్నాయి. పండుగ సమయాల్లో రద్దీకి అనుగుణంగా ప్రతి రోజు సగటున 500 నుంచి 1000 వరకు స్పెషల్ బస్సులను మాత్రమే సంస్థ నడుపుతుంది. ఆ స్పెషల్ బస్సుల్లో మాత్రమే జీవో ప్రకారం చార్జీల సవరణ ఉంటుంది. మిగతా రెగ్యులర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు.
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఇప్పుడు కూడా స్పెషల్ బస్సులను సంస్థ నడుపుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే ఈ నెల 20తో పాటు 27 నుంచి 30 తేదివరకు వరకు, అలాగే అక్టోబర్ 1, 5, 6 వ తేదిల్లో నడిచే స్పెషల్ బస్సుల్లోనే చార్జీల సవరణను సంస్థ చేయనుంది. ఆయా రోజుల్లో తిరిగే రెగ్యూలర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు చేయలేదు. పండుగల సమయాల్లో నడిచే అన్ని బస్సుల్లోనూ చార్జీలను సవరించారని కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేస్తోంది.