రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వరకు నిద్రపోయేది లేదు: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేసే వరకు నిద్ర పోయేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By Knakam Karthik
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వరకు నిద్రపోయేది లేదు: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేసే వరకు నిద్ర పోయేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో పర్యటించిన ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ...మెదక్ ప్రాంతానికి ఇందిరాగాంధీకి ఉన్న అనుబంధం విడదీయలేనిది. మెదక్ పేరు గుర్తొస్తేనే ఇందిరమ్మను తలచుకుంటాం. తన చివరి శ్వాస వరకు మెదక్ ఎంపీగా కొనసాగిన నాయకురాలు ఇందిరమ్మ. గత ప్రభుత్వ హయాంలో నిమ్జ్ అభివృద్ధి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిమ్జ్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచాం, భూసేకరణను వేగవంతం చేశాం. త్వరలో హ్యుందాయ్ కార్ల తయారీ కంపెనీ ఇక్కడ పనులు మొదలుపెడతారని చెప్పడానికి సంతోషిస్తున్నా. నిమ్జ్ భూ నిర్వాసితులైన 5612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఈ వేదికగా ప్రకటిస్తున్నా. ఆ కుటుంబాలకు భోజనాలు పెట్టి ఇండ్ల పట్టాలు ఇచ్చే బాధ్యత జగ్గారెడ్డికి అప్పగిస్తున్నాం. ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశిస్తున్నా..అని సీఎం మాట్లాడారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రైతు రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేశాం. రైతు భరోసాను రూ.12 వేలకు పెంచాం.. భూమిలేని పేదలకూ భరోసా అందిస్తున్నాం. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రూ. 500 లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. స్వయం సహాయక సంఘాల మహిళలకు బస్సులను అందించి వారిని ప్రోత్సహిస్తున్నాం. ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టాలనే కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా… ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం..అని సీఎం హామీ ఇచ్చారు.
ఇంటికో ఉద్యోగం అని చెప్పిన ఆయన తన ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకుని నిరుద్యోగ యువతను మోసం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకుంటాం. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధాని మోదీని ఎన్నిసార్లయినా కలుస్తాం. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు.. అభివృద్ధి కోసం అందరినీ కలుపుకుని ముందుకెళ్తాం. ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. శాసనసభకు రండి… ప్రజా సమస్యలపై చర్చించండి. మేం ఏదైనా తప్పులు చేస్తే సూచనలు ఇవ్వండి..సరిదిద్దుకుంటాం. అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తామని మీరు అనుకుంటే.. ప్రజలు గుణపాఠం చెబుతారు. ప్రజాప్రతినిధులుగా నిత్యం ప్రజలకు అండగా ఉండాలి. గెలిచినా, ఓడినా నేను ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నా. ముఖ్యమంత్రి అయ్యాక కూడా నేను ఏనాడు అహంభావం ప్రదర్శించలేదు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ కలుస్తున్నా..అని సీఎం వ్యాఖ్యానించారు.