తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో బిగ్ రిలీఫ్ దక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఆయనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హరీష్ రావుతో పాటు రాధా కిషన్ రావుపై కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో వారిద్దరినీ నిందితులుగా చేర్చారు. అయితే ఈ కేసులో ఇరువైపుల వాదనలు ఇప్పటికే ముగియగా, గురువారం ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హరీష్ రావుపై 2024 డిసెంబర్‌లో కేసు నమోదు అయింది. ఎలాంటి ఆధారాలు లేకుండా, కనీసం విచారణ చేయకుండా ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారని మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. తనపై కుట్రపూరితంగా కేసు నమోదు చేశారని, దీనిని కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టులో సాగిన సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. హరీష్ రావుపై నమోదు చేసిన కేసులో ఎలాంటి ఆధారాలు లేని కారణంగా కేసును కొట్టివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.