కేసీఆర్ పెట్టిన తప్పుడు కేసుల కారణంగానే మాకు ఈ పరిస్థితి: మంత్రి సీతక్క

కేసీఆర్ పెట్టించిన తప్పుడు కేసుల కారణంగానే కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుందని మంత్రి సీతక్క విమర్శించారు.

By Knakam Karthik
Published on : 24 July 2025 11:58 AM IST

Telangana,  Minister Seethakka, Former Cm Kcr, Congress, Brs, Nampally Court

కేసీఆర్ పెట్టిన తప్పుడు కేసుల కారణంగానే మాకు ఈ పరిస్థితి: మంత్రి సీతక్క

కేసీఆర్ పెట్టించిన తప్పుడు కేసుల కారణంగానే కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుందని మంత్రి సీతక్క విమర్శించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ 2021లో ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన నిరసన దీక్షపై గత ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా మంత్రి సీతక్క నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఇందిరా పార్క్ వద్ద ఏప్రిల్ 2021లో మేము నిరసన దీక్ష చేపట్టాము. గత ప్రభుత్వం మాపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతోంది. కోర్టుల మీద పూర్తి విశ్వాసం ఉంది. మేము ఎలాంటి తప్పు చేయలేదు, కాబట్టి నిర్దోషులుగా నిరూపించుకుంటాం . నాతోపాటు, ఎన్‌ఎస్‌యూఐ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్, హైదరాబాద్ అధ్యక్షుడు అభిజిత్ తో పాటు NSUI కార్యకర్తలపై కేసులు నమోదు చేయించారు..అని సీతక్క పేర్కొన్నారు.

కరోనాతో పేద ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆస్తులు అమ్ముకొని లక్షలు ఖర్చుచేసి చికిత్స చేసుకోవాల్సి వస్తోంది అన్న ఆవేదనతో మేము దీక్ష నిర్వహించాం. ప్రజల బాధలు చూడలేక మేము అప్పుడు నిరసన దీక్ష చేపట్టాము. అయితే మా మీద కక్ష కట్టిన ప్రభుత్వం మేము కరోనాను వ్యాప్తి చేస్తున్నామని తప్పుడు కేసులు నమోదు చేసింది. కరోనా కాలంలో ఇంటింటికి తిరిగి ప్రజలకు భరోసా కల్పించి అండగా నిలిచిన చరిత్ర మాది. అలాంటి మాపై కరోనాను వ్యాప్తి చేస్తున్నామని KCR గారు కేసులు నమోదు చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షలు వెచ్చించలేక కరోనాతో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అందుకే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి వారి ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతో ధర్నా చేపట్టాము. ఇదే విషయాన్ని మా తరఫున సీనియర్ న్యాయవాదులు కృష్ణ కుమార్ గౌడ్, ఎస్ఎస్ రావు, నరేందర్ వాదనలు వినిపించారు. మా వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 13 కు వాయిదా వేసింది..అని సీతక్క తెలిపారు.

Next Story