తీన్మార్ మల్లన్న సంగతి పార్టీ చూసుకుంటుంది, కులగణనలో ఎక్కడా లెక్క తప్పలేదు: మంత్రి సీతక్క
కులగణన సర్వే సరిగా లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
By Knakam Karthik Published on 5 Feb 2025 2:18 PM IST
తీన్మార్ మల్లన్న సంగతి పార్టీ చూసుకుంటుంది, కులగణనలో ఎక్కడా లెక్క తప్పలేదు: మంత్రి సీతక్క
కులగణన సర్వే సరిగా లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అభ్యంతరాలు ఉంటే పార్టీ వేదికల మీద మాట్లాడాలి కానీ.. బహిరంగంగా మాట్లాడటం మంచిది కాదని అన్నారు. ఆయన సంగతి పార్టీ చూసుకుంటుందని, ప్రజల సంతోషాన్ని చూసి ఓర్వలేక దీనిని అడ్డుకోవాలని, వర్గీకరణను కొందరు వక్రీస్తున్నారని ఆమె విమర్శించారు. 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ పంచాయితీని తెంచి, ఎవరి వాటా వారికి పంచామని అన్నారు. బీసీల లెక్క 56 శాతానికి పైగా తేలిందని, ఎక్కడా ఎవరికీ కూడా నష్టం జరగలేదని అన్నారు. మేక వన్నె పులిలా బీఆర్ఎస్ నేతలు బీసీల హక్కులను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే అశాస్త్రీయంగా, అసంబద్ధంగా చేశారని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కోసం ఒక్క రోజు సర్వే పేరుతో పైపైనే చేశారని విమర్శించారు. సొంత కుటుంబ గణన కేసీఆర్ చేశారు తప్ప.. కుల గణన చేయలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన బహిష్కరించాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చిందని.. ఇప్పుడు కుల గణన లెక్కల గురించి అడిగి హక్కు ఆ పార్టీకి లేదని ఫైర్ అయ్యారు. బీసీ సమాజం మొత్తం బీఆర్ఎస్‌ను ప్రశ్నించాలని ఆమె కోరారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేను ప్రశ్నిస్తోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి హయాంలో కుల గణనను ఎందుకు సమగ్రంగా చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ మాటలు నమ్మిన కొందరు బీసీలు వివరాలు నమోదు చేసుకోలేక నష్టపోయారని అన్నారు. ఇప్పుడు తాము చేసిన కులగణన సమాచారం ఆధారంగా సంక్షేమ పథఖాలను అమలు చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.