కేటీఆర్, హరీష్ సర్వేలో పాల్గొని..జనాభా లెక్కల్లో ఉండేలా చూసుకోవాలి: మంత్రి పొన్నం

కుల గణన సర్వేలో సమాచారం ఇవ్వని వారు ఈ నెల 28వ తేదీ వరకు నమోదు చేసుకోవాలని రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

By Knakam Karthik
Published on : 19 Feb 2025 3:01 PM IST

Telugu News, Telangana, Congress Government, Caste Census, Minister Ponnam Prabhaker, Brs, Congress

కేటీఆర్, హరీష్ సర్వేలో పాల్గొని..జనాభా లెక్కల్లో ఉండేలా చూసుకోవాలి: మంత్రి పొన్నం

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేలో సమాచారం ఇవ్వని వారు ఈ నెల 28వ తేదీ వరకు నమోదు చేసుకోవాలని రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు, బలహీన వర్గాల నాయకులు, ప్రొఫెసర్లు, వివిధ స్థాయిల్లో ఉన్న అందరి విజ్ఞప్తి మేరకు కులగణనలో నమోదు చేసుకోని వారికి మరో అవకాశం ఇవ్వడం జరిగిందని చెప్పారు. కులగణన సర్వేలో సమాచారం ఇవ్వడానికి మూడు పద్ధతుల్లో అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణ సమాజంలో కుల సర్వేలో వివరాలు నమోదు చేసుకోని వారు సమాచారం ఇవ్వనివారు.. సమాచారం ఇవ్వాలని ప్రభుత్వ తరపున విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

కులగణన సర్వేకు గతంలో విజ్ఞప్తి చేసిన వారు, విమర్శలు చేసిన వారు, ఇప్పుడు మిస్ అయిన వారందరినీ మోటివేట్ చేసి.. సర్వేలో భాగస్వామ్యులు అయ్యే విధంగా చూడాలని తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నా..అని మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. కులగణన సర్వేలో పాల్గొనని కేటీఆర్, హరీష్‌రావు సర్వేలో పాల్గొని బీఆర్ఎస్ తరపున బలహీన వర్గాలకు సానుకూలంగా ఉన్నామని చెబుతూ బాధ్యత గల ప్రతిపక్షంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. అలా చేయకుండా కేవలం విమర్శలకే పరిమితం అయితే.. తెలంగాణ బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవు అని హెచ్చరించారు. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న అవకాశాన్ని వినియోగించుకుని.. సర్వేలో భాగస్వామ్యులై తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండే విధంగా చూసుకోవాలి..అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Next Story