ఇందిరాగాంధీ గుణపాఠం చెబితే..ఇప్పుడు మోడీ వెనకడుగు వేశారు: సీఎం రేవంత్
ప్రధానిగా దేశానికి వన్నె తెచ్చిన మహా నాయకుడు రాజీవ్ గాంధీ..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik
ఇందిరాగాంధీ గుణపాఠం చెబితే..ఇప్పుడు మోడీ వెనకడుగు వేశారు: సీఎం రేవంత్
ప్రధానిగా దేశానికి వన్నె తెచ్చిన మహా నాయకుడు రాజీవ్ గాంధీ..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సచివాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి సీఎం పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఆర్థిక సరళీకృత విధానాలతో దేశాన్ని బలమైన ఆర్థిక దేశంగా నిలబెట్టారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించి ప్రభుత్వాల ఏర్పాటులో యువతకు భాగస్వామ్యం కల్పించారు...అని సీఎం పేర్కొన్నారు.
పహల్గామ్ ఘటన నేపథ్యంలో ఆనాటి ప్రధాని ఇందిరమ్మ స్ఫూర్తిని దేశంలో ప్రతీ ఒక్కరూ గుర్తు తెచ్చుకున్నారు. తీవ్ర వాదుల ముసుగులో దేశ పౌరులపై దాడులకు తెగబడితే ఆనాడు ఇందిరమ్మ పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పారు. మా దేశాన్ని మేం రక్షించుకోగలుగుతాం.. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ఇందిరాగాంధీ ఆనాడే స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం పహల్గామ్ ఘటనలో పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని మోడీ వెనకడుగు వేశారు. ట్రంప్ చెబితే కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ చేసిన పరిస్థితి ఇప్పటి కేంద్ర ప్రభుత్వానిది..అని రేవంత్ విమర్శించారు.
రాహుల్ గాంధీని విమర్శించడం ద్వారా బీజేపీ నాయకులు తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా..అండగా నిలబడాల్సిన సమయంలో కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకుని పడుకున్నారు. మేము బయటకు వచ్చి కేంద్రానికి అండగా ఉన్నామని ప్రకటించి మద్దతు తెలిపాం. ఆనాడు కనీసం మమ్మల్ని అభినందించని వ్యక్తి ఇవాళ రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారు. తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే కిషన్ రెడ్డి రాహుల్‌గాంధీపై విమర్శలు చేస్తున్నారు. సచివాలయం దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కొందరు విమర్శలు చేశారు. సంకుచిత మనస్తత్వం కలిగిన కొందరు రాజీవ్ గాంధీని విమర్శిస్తున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిది, కాంగ్రెస్ పార్టీది. దేశ రక్షణ కోసం భారత జవాన్లకు అండగా నిలబడతాం. అది మా బాధ్యత. దేశ సమగ్రత విషయంలో మేం రాజకీయాలు చేయం. దేశ భద్రతకు కట్టుబడి మేం పని చేస్తాం..అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.