సడెన్‌గా ఢిల్లీకి సీఎం రేవంత్..వారం తిరగకముందే మరోసారి వెళ్లడంపై ఉత్కంఠ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం రాత్రి ఆయన హుటాహుటిన హస్తినకు పయనమయ్యారు.
By Knakam Karthik Published on 15 Feb 2025 8:26 AM IST
సడెన్‌గా ఢిల్లీకి సీఎం రేవంత్..వారం తిరగకముందే మరోసారి వెళ్లడంపై ఉత్కంఠ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం రాత్రి ఆయన హుటాహుటిన హస్తినకు పయనమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుతో ఆయన ఢిల్లీ వెళ్లినట్లుగా సమాచారం. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలకు సంబంధించి కీలక విషయాలపై కాంగ్రెస్ అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు సమాచారం. అయితే గత వారమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. అయితే వారం రోజుల వ్యవధిలో మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం గమనార్హం.టీపీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం.
అలాగే నామినేటెడ్ ప్రభుత్వ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయడం, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడం వంటి అంశాలపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు.. కుల గణన సర్వే, స్థానిక సంస్థలు, పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను కూడా రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.
ఇందులో ప్రధానంగా కుల గణనలో పాల్గొనని వారి నుంచి సమాచారాన్ని సేకరించడానికి ఈ నెల 16 నుంచి 28 ప్రత్యేక సర్వే, సర్వే పూర్తి అయ్యాక దానికి చట్టబద్దత కల్పించి కేంద్రానికి పంపించడం, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా, పీసీసీ కార్యవర్గం ఖరారు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించనున్నట్లుగా తెలిసింది. దీనితో పాటుగా మంత్రివర్గ విస్తరణ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. గతంలో అనేక సందర్భాల్లో సీఎంతో పాటుగా పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ, ఉత్తమ్ లాంటి వారిలో ఒకరు తప్పనిసరిగా ఢిల్లీ పెద్దలు పిలిపించి మాట్లాడే వారు కానీ ఈ సారి మాత్రం కేవలం సీఎం రేవంత్‌రెడ్డినే పిలిపించడంపై ఆ పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ను నియమించిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, కీలక ప్రాజెక్టులకు నిధుల కేటాయించాలా కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నారు.