హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న నవీన్ రావుపై జరిగిన సిట్ (SIT) విచారణ ముగిసింది. దాదాపు ఎనిమిది గంటలపాటు కొనసాగిన ఈ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ట్యాపింగ్‌కు ఉపయోగించిన ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన నిధులను నవీన్ రావే సమకూర్చినట్లు పోలీసులు నిర్ధారించారు. అలాగే, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను తెప్పించినట్లు సిట్ తేల్చింది.
ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాల కోసం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రత్యేక కార్యాలయం తీసుకున్నట్లు కూడా విచారణలో బయటపడింది. ఇదే కార్యాలయం నుంచే ట్యాపింగ్ కార్యకలాపాలు నిర్వహించినట్లు అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా, బీఆర్‌ఎస్ నేతల తరఫున ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులతో నవీన్ రావు మధ్యవర్తిత్వం (మీడియేషన్) నిర్వహించినట్లు సిట్ నిర్ధారించింది.
ఈ వ్యవహారంలో రాజకీయ నేతల పాత్రపై కూడా విచారణ ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ కేసులో మరింత మంది పాత్రధారులపై విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.