కేసీఆర్, బండి సంజయ్ జనాలను మోసం చేస్తున్నారు : రేవంత్ రెడ్డి
Revanth Reddy Slams KCR And Bandi Sanjay. టీఎస్‌పీఎస్సీ కేసు విచారణ రాష్ట్ర అధికారులు చేపడితే కేసులో నిజానిజాలు నిగ్గు తేలవని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 18 April 2023 9:43 AM GMTRevanth Reddy
టీఎస్‌పీఎస్సీ కేసు విచారణ రాష్ట్ర అధికారులు చేపడితే కేసులో నిజానిజాలు నిగ్గు తేలవని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంలో పెద్దలను కాపాడుకునేందుకే ప్రభుత్వం సిట్ ను ఉపయోగించుకుందని ఆయన ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. 22 కోట్ల 6 లక్షల దరఖాస్తులు వస్తే 7,22,311ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంట్ లో ప్రధాని సమాధానం ఇచ్చారు. పార్లమెంటు సాక్షిగా ప్రధాని నిరుద్యోగులను మోసం చేశరన్నారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తే ఒకే రోజులో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బండి సంజయ్ చెబుతున్నాడు. బండి మాటలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదన్నారు. హైదరాబాద్ వరదల సమయంలో బండి పోతే బండి ఇస్తామన్నారు. ఆ తరువాత ఇన్సూరెన్స్ ఉంది కదా అన్నారు. అసలు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో బండికి తెలుసా? అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్, ఒకే రోజు 2 లక్షల ఉద్యోగాలని బండి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
ప్రజాక్షేత్రం నుంచి పార్లమెంట్ వరకు నిరుద్యోగుల కోసం కొట్లాడింది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ మోదీ ఇంటి దగ్గర చేయాలని సూచించారు. ఈ నెల 21న నల్గొండలో మాహాత్మా గాంధీ యూనివర్సిటీ లో నిరుద్యోగ నిరసన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఈ నెల 24న ఖమ్మం జిల్లాలో, 26న ఆదిలాబాద్ లో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మే 4న లేదా 5న సరూర్ నగర్ లో నిరుద్యోగుల సమస్యలపై భారీ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎల్బీ నగర్ లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించి.. సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళతామని తెలిపారు. ఈ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిధిగా హాజరవుతారని వెల్లడించారు.
ఇది కాంగ్రెస్ పార్టీ కోసం కాదు.. నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాటమని రేవంత్ తెలిపారు. అన్ని నిరుద్యోగ సంఘాలు మద్దతు తెలపాల్సిందిగా కోరారు. మే 9 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర రెండో విడత కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. జోగులాంబ జిల్లా నుంచి యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.