ఆనాడు దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి.. ఇప్పుడు కేటీఆర్‌ను ఎందుకు చేయరు.? : రేవంత్ రెడ్డి
TPCC Leader Revanth Reddy Fire On CM KCR. ఆదిలాబాద్ జిల్లాలో ఎండిన ఆకులు కొన్ని రాలినా.. కొత్త చిగురులు వస్తుంటాయి.
By Medi Samrat
TPCC Leader Revanth Reddy
ఆదిలాబాద్ జిల్లాలో ఎండిన ఆకులు కొన్ని రాలినా.. కొత్త చిగురులు వస్తుంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందనడానికి ఈ సభ నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంచిర్యాలలో జరిగిన భారత్ సత్యాగ్రహ సభలో ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్ వెనుకబడిన జిల్లాల్లో 23వ జిల్లాగా ఉందని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ తరపున ఆదిలాబాద్ అడవి బిడ్డలకు మాట ఇస్తున్నా.. అధికారంలోకి రాగానే ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు.
కేసీఆర్ మేకవన్నె పులిలా దళితులను వేటాడుతుండని.. అంబేద్కర్ పేరుతో దళితుల ఓట్లను కొల్లగొట్టాలని చూస్తున్నాడని విమర్శించారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన కేసీఆర్...ఆనాడు మేం ప్రాజెక్టుకు పెట్టిన అంబేద్కర్ పేరును ఎందుకు తొలగించారు? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో దళితుల ఓట్ల కోసమే కేసీఆర్ డ్రామాలు.. అవినీతి ఆరోపణలతో ఆనాడు దళిత ఉప ముఖ్యమంత్రిని కేసీఆర్ బర్తరఫ్ చేశారని అన్నారు. ఇప్పుడు కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొడుకును మంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేయరు? అని ప్రశ్నించారు.
మల్లిఖార్జున్ ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని అన్నారు. అటు మోదీ ని.. ఇటు కేడీని గద్దె దించి తీరతాం అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది.. కొత్త ఏడాదిలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు 2లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకుంటామని తెలిపారు. రూ. 500 లకే ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు.