విద్యుత్ అంశంపై అమెరికాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. తాను మాట్లాడిన వీడియోలను బీఆర్ఎస్ పార్టీ వాళ్లు అనుకూలంగా కట్ చేసుకొని దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం హయంలో జరిగిన బషీర్ బాగ్ కాల్పుల సమయంలో కేసీఆర్ ఆ పార్టీలో కీలకంగా ఉన్నారని.. నాటి రైతుల పరిస్థితులను గమనించిన కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, ఉచిత విద్యుత్ తో పాటు రైతులపై నమోదైన అన్ని కేసులను ఎత్తేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఎన్నికయ్యారని.. ప్రమాణస్వీకారం సమయంలో ఉచిత విద్యుత్ ఫైల్ పై సంతకం చేశారని.. ఉచిత విద్యుత్ తో పాటు నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఉంటుందా? అని తానా సభలో తనను అడిగారని, తాను చెప్పిన సమాధానంలో ఒక బిట్ ను కట్ చేసి వక్రీకరించారన్నారు. 2004 మేనిఫెస్టోలోనే తమ పార్టీ ఉచిత విద్యుత్ ను పెట్టిందని, కానీ కేసీఆర్ కుదరదని చెప్పారన్నారు.
తాను రైతు బిడ్డనని, కేటీఆర్ లాగా అమెరికాలో పని చేయలేదన్నారు. తాను వ్యవసాయం చేశానని, నాగలి కట్టినట్లు చెప్పారు. తనతో పొలంలో కేటీఆర్ పోటీ పడగలడా? అని ప్రశ్నించారు. కేటీఆర్ కు సవాల్ విసురుతున్నానని తనతో పాటు వ్యవసాయం చేయగలడా? అని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలపై కేటీఆర్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయం చేస్తోందన్నారు. బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆరే కారణమని, ఆనాడు రైతులను కాల్చి చంపించింది కూడా ఆయనే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత కరెంట్ కు వ్యతిరేకంగా నాడు కేసీఆర్ ప్రకటనలు ఇచ్చారన్నారు. తాను పీసీసీ హోదాలో తానా సభకు హాజరయ్యానని, తమ పార్టీ విధానాలను వివరించేందుకు వెళ్లినట్లు చెప్పారు.