కేసీఆర్.. నువ్వు బీజేపీ పంజరంలో ఉన్న చిలకవు : రేవంత్ రెడ్డి

Revanth Reddy Fires On CM KCR. తెలంగాణలో కొత్త సంవత్సరంలో విధి బాగోతం నడుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు

By Medi Samrat  Published on  10 Jan 2022 12:14 PM GMT
కేసీఆర్.. నువ్వు బీజేపీ పంజరంలో ఉన్న చిలకవు : రేవంత్ రెడ్డి

తెలంగాణలో కొత్త సంవత్సరంలో విధి బాగోతం నడుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమ‌వారం గాంధీభ‌వ‌న్‌లో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి కార్యాచరణ ఉంటుందని.. కాంగ్రెస్ పార్టీ స్థానికత ఆధారంగా ప్రజలు చేస్తున్న పోరాటానికి స్థానికత కల్పించిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 371 డి ఆర్టికల్ ను తీసుకొచ్చిందని.. 317 జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని అన్నారు. దీని ద్వారా స్థానికత కోల్పోయి ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ లో దీక్ష ఎలా చేస్తారని ప్ర‌శ్నించారు. జాతరలో గంగిరెద్దుల వాళ్ళు వచ్చినట్టు దేశం నలుమూలల నుండి బీజేపీ వాళ్ళు వస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం పంపించిన ఉత్తర్వులను ఆమోదించిందే కేంద్ర ప్రభుత్వం.. దానిని రాష్ట్రపతి ఆమోదించారు.. 317జీవో విరుద్ధంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదించిందని ప్ర‌శ్నించారు. జీవో సవరణలు చేయాలనుకుంటే ఒక్క కలం పోటుతో కేంద్ర ప్రభుత్వం సవరణ చేయవచ్చని అన్నారు. కేసీఆర్, వామపక్షాలు, బీజేపీ, కాంగ్రెస్ ఏతర పక్షాలను కలుపుకొని కూటమి కడదాం అంటున్నార‌ని రేవంత్ అన్నారు.

కేసీఆర్ నువ్వు బీజేపీ పంజరంలో ఉన్న చిలకవు.. జగన్, నవీన్ పట్నాయక్ దగ్గరికి కూటమి కడదామని వెళ్ళవా.. అని అడిగారు. యూపీఏ లో ఉన్న డీఎంకే, శరత్ పవార్, కమ్మునిస్ట్ లను కలుస్తున్నావ్.. కాంగ్రెస్ ను బలహీన పర్చడానికి సుఫారీ తీసుకున్నావ్.. యూపీలో అఖిలేష్ యాదవ్ ని గెలిపించడానికి మద్దతు ఇస్తున్నవా కేసీఆర్ చెప్పాలి.. అక్కడ వామపక్షాలు మద్దతు ఇస్తున్నామని చెప్పాయి.. యోగిని దింపడానికి.. నువ్వు ప్రచారానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవా.. చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ త‌ర‌పున డిమాండ్ చేసింది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలహీనపర్చడానికి టీఆర్ఎస్‌, బీజేపీ ఆడుతున్న నాటకం ఆడుతున్నాయ‌ని.. మోదీ ఇచ్చిన ఎజెండాని కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. నరేంద్రమోదీ, బండి సంజయ్ దేశభక్తి నేతి బీరకాయలో నెయ్యంత అని రేవంత్ వ్యాఖ్యానించారు. మెడిన్ ఇండియా, మేకిన్ ఇండియా అని చెప్పుకునే బీజేపీ.. సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని చైనాలో తయారుచేసి గుజరాత్ లో పెట్టారని విమ‌ర్శించారు.

ముచ్చింతల్ లో రామనుజాచార్యా విగ్రహాన్ని ప్రధాని అవిష్కరిస్తుండడంతో రామేశ్వర్ రావు సమీక్షకి కేసీఆర్, మంత్రులు, కేబినెట్ వెళ్లడం ఏందని విమ‌ర్శించారు. రామనుజాచార్యా విగ్రహం కూడా చైనా లోనే తయారైందని ఆరోపించారు. 50 యాప్ లను నిషేధించామని చెప్పుకుంటున్న బీజేపీ.. నిజమైన దేశభక్తి ఉంటే చైనాలో తయారైన రామనుజాచార్యుల విగ్రహం ప్రారంభానికి ప్రధాని ఎలా వస్తారని ప్ర‌శ్నించారు

ఇందిరాగాంధీ తో కేసీఆర్ ని పోల్చడం ద్వార హేమంత్ బిస్వాస్ క్షమించరాని నేరం చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇందిరాగాంధీ పేరు ఎత్తే అర్హత బీజేపీ నేతలకు లేదని అన్నారు. మీకు చేతనైతే 317 జీవో ని వెంటనే రద్దు చేయాలి.. స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ నాయకుల కుక్క కూడా చావలేదు.. లక్షలాది మంది కాంగ్రెస్ శ్రేణులు మరణించారని రేవంత్ అన్నారు.


Next Story