సుప్రీం జడ్జి పర్యవేక్షణలో.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ జరగాలి

Revanth Reddy Fire on KCR And KTR. సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసును విచారించాలని టీపీసీసీ అధ్యక్షుడు

By Medi Samrat  Published on  29 Oct 2022 10:15 AM GMT
సుప్రీం జడ్జి పర్యవేక్షణలో.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ జరగాలి

• ఈ కేసులో ఎ1, ఎ2లుగా కేసీఆర్, కేటీఆర్ ను చేర్చాలి

• కాంగ్రెస్ చర్చలోకి రాకుండా చేయాలనే ఈ డ్రామాలు

• సీఎం, మంత్రుల, అధికారులు ఈ అంశాలపై స్పందించాలి - టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసును విచారించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రను, మునుగోడు ఎన్నికలను పక్కదోవ పట్టించే క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ నాటకాలు ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు కేంద్రం చేతుల్లో ఉన్నాయి, రాష్ట్ర పోలీసులు, ఏసీబీ కేసీఆర్ డైరెక్షన్లో పని చేసున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద నమ్మకం లేదు. కాబట్టి సుప్రీం కోర్టు జడ్జి పర్యవేక్షణలో రోజూ నివేదికలు ఇచ్చే విధంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసును విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసులో ఎ1, ఎ2లుగా కేసీఆర్, కేటీఆర్ చేర్చాలన్నారు.

రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే విధంగా టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సమన్వయంతో పని చేస్తున్నాయి. కేసీఆర్ ను ఓడించాలనుకునే వారు బీజేపీకి, బీజేపీని ఓడించాలనుకునే వారు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేలా పరిస్థితులు కల్పిస్తున్నాయి. తద్వారా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనుకుంటున్నాయి. దుబ్బాక ఉపఎన్నికల్లో ఇదే జరిగింది. అప్పుడు హరీశ్ రావు ఏదో ఒక వివాదం సృష్టించేవారు. ఆ ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు బావమరిది దగ్గర డబ్బులు దొరికాయి. రఘునందన్ రావు మీద కేసులు పెట్టారు. ఫలితంగా రఘునందన్ రావుకు సానుకూల వాతావరణం ఏర్పడేలా చేశారు. దీంతో రఘునందన్ రావు మీద సానుభూతితో కేసీఆర్ ను ఓడించాలనే లక్ష్యంతో దుబ్బాకలో బీజేకి ఓటు వేశారు. గెలిచిన రఘునందన్ అసెంబ్లీ పోయారు. ఆయన మీద పెట్టిన కేసులు, దొరికిన డబ్బులు ఎటు పోయాయో ఇప్పటికీ తెలియదు. హుజురాబాద్లో కూడా ఈటెల రాజేందర్ సానుభూతితోనే గెలిచారు. ఉద్యమకారుడు, బలహీనవర్గాల బిడ్డకు అన్యాయం జరుగుతుందనే భావన టీఆర్ఎస్ పార్టీ కలిగించింది. ఫలితంగా సానుభూతితో కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ ఈటెలకు పడ్డాయి. గెలిచిన తర్వాత ఈటెల ఆక్రమించుకున్న భూముల కేసులు ఏమయ్యాయి? ఆయనపై కేసులు ఏమయ్యాయి? ఆయన్ను జైలుకు పంపిస్తామన్న వారు ఏమయ్యారు? ఢిల్లీలో అమిత్ షా, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పార్టీని ఆటలో నుంచి తప్పించే కుట్రలకు పాల్పడుతున్నారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా భావోద్వేగాలను ముందు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా అదే జరిగే అవకాశం ఉందని ఇలాంటి కుట్రలను తిప్పి కొట్టాలని నేను కొన్ని రోజుల ముందే శ్రేణులకు పిలుపునిచ్చా. ఇప్పుడు అదే జరుగుతుంది.

మూడు రోజుల క్రితం వెలుగు చూసిన ఫామ్ హౌస్ లో నాటకం పరాకాష్టకు చేరింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను, మునుగోడు ఉప ఎన్నికల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ నాటకానికి తెరలేచింది. కేసీఆర్, కేటీఆర్ కు ఫామ్ హౌస్ లు బాగా అచొచ్చాయి. అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని చర్చకు తెచ్చారు. ఇప్పటివరకు విడుదలైన ఆడియో రికార్డుల ప్రకారం పైలట్ రోహిత్ రెడ్డి వాళ్ళను డబ్బులు అడుగుతున్నాడు. ఇతరులను తీసుకొస్తానని బేరం చేస్తున్నాడు. అప్పుడు రోహిత్ రెడ్డితోపాటు అతని వెంట ఉన్న ఎమ్మెల్యేలను నిందితులుగా చేర్చకుండా పీసీ యాక్ట్ ఎలా నిలబడుతుంది. డబ్బు డిమాండ్ చేసిన రోహిత్ రెడ్డిని నిందుతుడిగా చేర్చకుండా ఆ డిమాండ్ ను నేరవేరుస్తామన్నా తాంత్రికుల మీద కేసు పెడితే ఎలా నిలబడుతుంది. అందుకే ఏసీబీ రిమాండ్ ను తిరస్కరించింది. ఈ మాత్రం కూడా స్టీఫెన్ రవీంద్ర గారికి తెలియదా? ఈ వ్యవహారంలో భాగస్వాములైన తాంత్రికులు, ఎమ్మెల్యేలలో.. తాంత్రికుల ఫోన్లను సీజ్ చేసి.. అత్యంత కీలకమైన నలుగురు ఎమ్మెల్యేల ఫోన్స్ ఎందుకు సీజ్ చేయలేదు. ఆడియో టేపుల్లో కొడంగల్, చేవెళ్ల ఎమ్మెల్యేల పేర్లుకు చర్చకు వచ్చాయి. వారిని ఎందుకు విచారించలేదు. వారి ఫోన్లను ఎందుకు సీజ్ చేయలేదు. కేసును నిరూపించాలన్నా ఫోన్స్, అక్కడి సీసీ కెమెరాలే కీలకం. నేరం జరిగిన ప్రదేశం నుంచి పోలీసులే ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆ ఎమ్మెల్యేలు కనిపించడం లేదు.. వారు ఎక్కడున్నారు? వారిని ఏం చేశారు? ఎమ్మెల్యేల ముఠాకు నాయకుడైన కేసీఆర్ పర్యవేక్షణలొనే ఈ వ్యవహారం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. అలా అయితే కేసీఆర్ ను ఏ1గా, కేటీఆర్ ను ఏ2గా చేర్చాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలను నిందితులుగా చేర్చాలి వారికి సంబంధం లేకుంటే..ఢీల్లీ పెద్దలు 1,2లు ఎ1గా, ఎ2గా, సంతోష్ జీని ఎ3గా తర్వాత తాంత్రికులను నిందితులుగా చేర్చి వారిపై కేసులు నమోదు చేయాలి. ఈ వ్యవహారంలో భాగస్వాముల్లో కొంత మంది స్వేచ్ఛగా తిరుగుతుంటే మరికొంత మందిని నిర్భందించడాన్ని చూస్తుంటే పోలీసుల చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది. నేరం జరిగిన ప్రదేశంలో అక్కడ దొరికిన వస్తువులను సీజ్ చేసి కోర్టు వద్ద డిపాజిట్ చేయాలి. తర్వాత వాటిని కోర్టు అనుమతితో విశ్లేషించి చార్జిషీట్ దాఖలు చేయాలి. అయికే ఈ కేసులో ఏయే వస్తువులను కోర్టు వద్ద డిపాజిట్ చేశారు. ఫోన్స్ సీజ్ చేస్తే ఆ ఆడియో రికార్డులు ఎలా బయటకు వచ్చాయి. బయటకు వచ్చింది ఆడియో ఎడిట్ వెర్షన్ మాత్రమే. అసలు ఏం జరిగిందనేది చెప్పాల్సిన బాధ్యత విచారణ సంస్థలపై ఉంది. బాధ్యత గల సీఎం, హోం మంత్రి, డీజీపీ ఈ అంశాలపై స్పందించాలి.

బీజేపీ ప్రభుత్వం ఈ 8 ఏళ్లలో ఎమ్మెల్యేల కొనుగోలు ద్వారా ప్రజలు ఎన్నుకున్న 11 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసీఆర్ కు కొత్తకాదు. కేసీఆర్ 2014 నుంచి ఇప్పటి వరకు 32 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ పై సీఎం కేసీఆర్ ప్రజలకు ఏం జరిగిందో వివరించాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడివి బండి సంజయ్ వి జోకర్ వేషాలు. బయటకు వచ్చిన ఆడియో టేపుల్లోనే సంజయ్, కిషన్ రెడ్డి పాత్రలేదని వీళ్లంతా ఉత్తోళ్లని వెల్లడైంది. ఇంకా దేనికి ప్రమాణం. ఆయన నీళ్లు కాదు యాసిడ్ పోసుకుని ప్రమాణం చేసినా, గుండుతో గుట్ట ఎక్కిన ప్రజలు నమ్మరు. అంత బుద్ధిమంతుడైతే కొన్ని రోజుల క్రితం నేను మునుగోడు ఎన్నికల్లో మందు పోయకుండా, డబ్బు పంచకుండా ఓటు అడగాలి అని యాదగిరిగుట్ట నర్సింహస్వామి మీద ఒట్టేస్తారా అనే సవాల్ ను విసిరితే ఎందుకు స్వీకరించలేదు. ఆ సవాలుకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. నేను వస్తా..బండి సంజయ్, కేటీఆర్ వచ్చి ఒట్టేస్తారా. లేదా అభ్యర్థులు వెళ్లి ప్రమాణం చేసిన సరే. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది.

చండూరు రోడ్ షో

"రాజగోపాల్ రెడ్డి నీది అమ్ముడు పోయే బుద్ధి. మునుగోడు సమస్యల మీద పోరాటం చేయాలని నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మీ ఓట్లను ఢిల్లీకి అమ్ముకున్నాడు. ఇక్కడి ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢీల్లీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టాడు. అమ్ముడు పోయిన రాజగోపాల్ మళ్లీ కొట్లాడుతానంటే ప్రజలు నమ్మరు. అంగి మార్చినా, రంగు మార్చినా నిన్ను నమ్మే పరిస్థితే లేదు" అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజీపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డిపై ధ్వజమెత్తారు. మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా చండూరులో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు పోటీలో ఉన్నోళ్లు కొత్తవారేం కాదు. 2014లో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మిమ్మల్ని మోసం చేస్తే, 2018లో గెలిచిన రాజగోపాల్ రెడ్డి మిమ్మల్ని నట్టేటా ముంచాడు. ఈ ప్రాంతంలో గెలిచిన కొండా బాపూజీ, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఐదు సార్లు కమ్యూనిస్టులు గెలిచారు. వారిలో ఎవ్వరూ కూడా కాంట్రాక్టులకు అమ్ముడు పోలేదు. నిజాయితీగా ప్రజల కోసం కష్టపడ్డారు. ఈ ప్రాంతంలో బడైనా, గుడైనా కట్టించి అభివృద్ధి చేసిన వ్యక్తి పాల్వయి గోవర్ధన్ రెడ్డి. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హయాంలో మీ ఊర్లలో కరెంట్, తాగే నీరు, ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయి. రాచకొండ ప్రాంతంలో 10 వేల ఎకరాల్లో అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చారు. మునుగోడులో జరిగిన 12 ఎన్నికల్లో ఒక్క ఆడబిడ్డ గెలవలేదు. ఇప్పుడు సోనియా గాంధీ గారు పాల్వాయి స్రవంతికి ఆ అవకాశమిచ్చారు. మునుగోడు సమస్యలపై అసెంబ్లీలో కొట్లాడే తెగువ ఈ ఆడబిడ్డకు ఉంది. యువతను తాగుబోతులు చేస్తున్న టీఆరెస్, బీజేపీలకు బుద్ధి చెప్పే విధంగా స్రవంతిని గెలిపించండి. మందు పోయకుండా, డబ్బులు ఇవ్వకుండా ఓటు అడుగుదామని స్రవంతి సవాలు చేస్తే రాజగోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ సన్నాసులు పారిపోయారు. తడి గుడ్డతో గొంతు కోసే బీజేపీ తడిబట్టల ప్రమాణాల్ని జనం నమ్మరు. ఒక్కసారి ఆడబిడ్డకు అవకాశం ఇవ్వండి. మునుగోడు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టండని రేవంత్ రెడ్డి మహిళలను కోరారు.


Next Story