హరీష్ రావు మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాలి : రేవంత్ రెడ్డి

Revanth Reddy demands that Harish Rao resign as minister. వైద్యం వికటించి మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందిన విష‌యం తెలిసిందే.

By Medi Samrat
Published on : 13 Jan 2023 5:16 PM IST

హరీష్ రావు మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాలి : రేవంత్ రెడ్డి

వైద్యం వికటించి మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఈ ఘ‌ట‌న‌ అత్యంత దారుణం.. ప్రభుత్వ నిర్లక్షానికి పరాకాష్ట అని మండిప‌డ్డారు. మలక్ పేట ఆసుపత్రిలో కల్వకుర్తికి చెందిన‌ సిరివెన్నెల, సైదాబాద్ కు చెందిన శివానిలు చికిత్స పొందుతూ వైద్యం వికటించి మృత్యువాత పడ్డారు. ఇది హృదయ విధారకరమైన సంఘటన అని అన్నారు. హైదరాబాద్ లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. కనీసం బాలింతలను కాపాడలేకపోతోందని విమ‌ర్శించారు. వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని.. ప్రభుత్వ వైఖరి వల్లనే ప్రైవేట్ వైద్యం ఇక్కడ అభివృద్ధి చెందుతుందని ఆరోపించారు. ప్రపంచ స్థాయి అని చెప్పుకుంటున్న హైదరాబాద్ లో ఇంత ఘోరమా ? ప్రభుత్వ వైద్యం పై పూర్తిగా నమ్మకం పోతోందని అన్నారు.

ఇబ్రహీంపట్నం లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు వికటించి న‌లుగురు బాలింతలు చనిపోయారు. ఆగస్టు చివరి వారంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి బాలింతలు మృత్యువాత పడ్డారు. 4 నెలల్లోనే మళ్ళీ ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్ లోనే ఇలా ఉంటే.. ఇక మారుమూల పల్లెల్లో, అటవీ ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటి..? అని ప్ర‌శ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ప్రజలకు భయం వేస్తోందని.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాటలకే పరిమితం అయ్యారని మండిప‌డ్డారు. ఈ ఘటనకు హరీష్ రావు బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మృత్యువాత పడ్డ పేద బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం అందించాలని కోరారు.


Next Story