తెలంగాణ ఇచ్చినట్లే.. రూ.4000 పెన్షన్ ఇచ్చి తీరుతాం : రేవంత్ రెడ్డి

Revanth Reddy criticizes BRS. ఖమ్మంలో తెలంగాణ జన గర్జన సభను విజయవంతం చేసినందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

By Medi Samrat  Published on  3 July 2023 1:39 PM GMT
తెలంగాణ ఇచ్చినట్లే.. రూ.4000 పెన్షన్ ఇచ్చి తీరుతాం : రేవంత్ రెడ్డి

ఖమ్మంలో తెలంగాణ జన గర్జన సభను విజయవంతం చేసినందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖమ్మం ప్రజలకు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ గాంధీ సభను విఫలం చేసేందుకు బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. బీఆర్ఎస్ తో పాటు కొంతమంది ప్ర‌భుత్వ అధికారులు ఇలా చేయడంతో కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తోందన్నారు. జన గర్జనకు రాకుండా ప్రభుత్వం అన్ని రకాల కుయుక్తులు చేసిందని ఆరోపించారు. అధికారులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, అక్కడి సైకో మంత్రి సభకు రాకుండా జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అసలు నక్క తప్ప వేట కుక్కలన్నీ బయటకు వచ్చి మొరగడం మొదలు పెట్టాయని అన్నారు.

ఏ హోదాలో రాహుల్ ఇక్కడికి వచ్చారని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీది మీలా దోపిడీ కుటుంబం కాదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ కుమారుడు రాహుల్ గాంధీ అని అన్నారు. దేశం కోసం సర్వం త్యాగం చేయడానికి భారత్ జోడో యాత్రతో ప్రజల్లోకి వచ్చిన నాయకుడు రాహుల్.. దేశంలో రాహుల్ గాంధీకి కాకుండా ఇంకెవరికి తెలంగాణలో పర్యటించే అర్హత ఉందని ప్ర‌శ్నించారు. మీరు అంతగాకుతున్న నరేంద్ర మోదీకి ఆ అర్హత ఉందా? అసలు మీకున్న అర్హత ఏంటి? అడిగారు. ట్విట్టర్ పిట్ట, మంత్రులు రాహుల్ అర్హతపై ప్రశ్నిస్తున్నారు.. భూమికి మూడు అడుగులున్నోడు కూడా రాహుల్ అర్హత గురించి మాట్లాడుతుండని ఎద్దేవా చేశారు.

కడుపుకు అన్నం తినేవారు ఎవరూ రాహుల్ అర్హత గురించి ప్రశ్నించరని అన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ ..ఏ హామీని నిలబెట్టుకోలేదో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని స‌వాల్ విసిరారు. కాంగ్రెస్ ఎన్నో పథకాలు, ఎన్నో చట్టాలు, ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చిందని అన్నారు. మీరు ఫామ్ హౌస్ లు, పేపర్, టీవీలు పెట్టుకోవడం తప్ప ఏం తెచ్చారు? అని ప్ర‌శ్నించారు.

రాహుల్ ను విమర్శించడమంటే హరీష్, కేటీఆర్ ఒకరిపై ఒకరు కాండ్రించి ఉమ్మేసుకున్నట్లేన‌ని కామెంట్ చేశారు. మీరు దోపిడీ దొంగలు, బందిపోటు దొంగలకంటే హీనం.. నిన్నటి ఖమ్మం సభ చూసైనా బుద్ది తెచ్చుకోండని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్+బీజేపీ= బైబై.. బీఆర్ఎస్ జాతీయ పార్టీ విధానం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌ అంటేనే బీజేపీ రిస్తాజార్ సమితి అని మా నాయకుడు నిన్ననే చెప్పారు. బీఆర్ఎస్‌ ను మాతో కలుపుకోము అని మా నాయకుడు స్పష్టం చేశారు. మా విధానం ఏంటో మేం చెప్పాము.. మీ విధానం ఏంటో మీరు చెప్పండని అన్నారు.

అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించినా రూ.4000 పెన్షన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ అవినీతిని ఆపితే చాలు మొత్తం 55 లక్షల మంది పెన్షన్ దారులకు పెన్షన్ ఇవ్వొచ్చని అన్నారు. తెలంగాణ ఇచ్చినట్లే.. రూ.4000 పెన్షన్ ఇచ్చి తీరతామ‌న్నారు. కేసీఆర్ కు చిత్తం శివుడి మీద, భక్తి చెప్పులపై ఉందని అన్నారు.

రాష్ట్ర జనాభా అవసరాలు, పరిస్థితులను బట్టే పథకాలు ఉంటాయని.. రాష్ట్ర ఆదాయం ఆధారంగానే ప్రాధాన్యతలు ఉంటాయని వెల్ల‌డించారు. తెలంగాణలో మా ప్రాధాన్యత రూ.4000 పెన్షన్ ఇవ్వడం.. బీఆర్ఎస్ నేతలవి పసలేని వాదనలని ఎద్దేవా చేశారు. బెంగుళూరులో జరిగే ప్రతిపక్షాల సమావేశానికి బీఆర్ఎస్ ను రానివ్వమ‌న్నారు. ఒకవేళ సిగ్గులేకుండా వచ్చినా.. బీఆర్ఎస్ ను మెడలు పట్టి గెంటేస్తామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈడీ దాడులు జరగకుండా ఉండేందుకే కేటీఆర్ కేంద్ర పెద్దలను కలిశారు. కాంగ్రెస్ ను విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని అన్నారు. ఏపీలో పోటీ చేస్తామంటున్న బీఆర్ఎస్.. తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెబుతుంది? అని ప్ర‌శ్నించారు. భట్టి చదువుకున్న ప్రజాప్రతినిధి.. ఆయ‌న‌ను దళితుడని చిన్నచూపు చూసే బీఆర్ఎస్ నేతల మూతిపై కొట్టాలని అన్నారు. దళితుడే సీఎం అని.. వర్గీకరణకు సహకరించకుండా దళితులను అవమానించింది బీఆర్ఎస్సేన‌ని అన్నారు.


Next Story