హైదరాబాద్: ఆర్టీసీ టికెట్ ధరల పెంపుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన "చలో బస్ భవన్" పిలుపు నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో కోకాపేటలోని హరీశ్ రావు ఇంటి చుట్టూ భారీగా పోలీసుల మోహరించారు. గచ్చిబౌలిలోని కేటీఆర్ నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. అటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నివాసాన్ని కూడా పోలీసులు చుట్టుముట్టారు.
అయితే చలో బస్ భవన్ కార్యక్రమం నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయనున్నారు. ఉదయం 9:00 గంటలకు రెతిఫైల్ బస్ స్టాప్ నుండి టీఎస్‌ఆర్‌టీసీ బస్ భవన్ వరకు బస్సులో ప్రయాణించి, ఉదయం 9:30 గంటలకు బస్ భవన్‌కు చేరుకుని, టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తారు.