బీఆర్‌ఎస్ విలీనానికి సంబంధించి జాతీయ పార్టీతో చర్చలు జరుపుతోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. పనిగట్టుకుని కొన్ని మీడియా సంస్థలు ఈ పనులు చేస్తున్నాయని అన్నారు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా దురుద్దేశపూర్వకమైన అబద్ధాలను ప్రచారం చేసినందుకు క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
“హిడెన్ ఎజెండాలతో నిరాధారమైన వదంతులు వ్యాపింపజేసే వారికి, ఇదే చివరి హెచ్చరిక. నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేయడం ఆపండి. BRSకి వ్యతిరేకంగా అబద్ధాలకు రిజాయిండర్‌ను ప్రచురించండి లేదా చట్టపరమైన చర్యలను ఎదుర్కోండి, ”అని కేటీఆర్ X లో పోస్ట్ చేశారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ చేస్తున్న సేవ కొనసాగుతుందని కేటీఆర్ తెలిపారు. గడచిన 24 ఏళ్లుగా వందలాది మంది విధ్వంసకారులను, వేలాది మంది దురుద్దేశపూరిత ప్రచారకులను, పథకాలను పార్టీ స్థైర్యంతో తట్టుకుని నిలబడిందని గుర్తు చేశారు. పార్టీ అలుపెరగని పోరాటం చేసి, తెలంగాణను సాధించి, తెలంగాణను నిర్మించిందని అన్నారు. ప్రగతికి గర్వకారణంగా నిలిచిన రాష్ట్రమని.. ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు. పడిపోతాం, లేస్తాం, పోరాడేది తెలంగాణ కోసమే! మేము ఎన్నటికీ తలవంచము. ఇప్పుడు కాదు, ఎప్పుడూ కాదని కేటీఆర్ తన ట్విట్టర్ లో తెలిపారు.