తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయి..కేటీఆర్ సంచలన ఆరోపణలు

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా నిలబడుతుందని కేటీఆర్ ఆరోపించారు.

By Knakam Karthik  Published on  23 Feb 2025 5:00 PM IST
Telangana, Ktr, Brs, Congress, Cm Revanth, Bjp

తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయి..కేటీఆర్ సంచలన ఆరోపణలు

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా నిలబడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాజకీయంగా ఢిల్లీలో కొట్లాడుతూ.. తెలంగాణలో మాత్రం బీజేపీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి అన్ని రకాల రక్షణలను కల్పిస్తూ కాపుకాస్తుందని కేటీఆర్ ఆరోపించారు. దాదాపు 15 నెలల కాలంలో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనేక స్కామ్‌లకు పాల్పడుతున్నా, కేంద్ర ప్రభుత్వం కనీసం ఇప్పటిదాకా స్పందించలేదన్నారు.

ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంపైన ఆగమేఘాల మీద స్పందించి కేంద్ర ప్రభుత్వ సంస్థలను రంగంలోకి దించి, విచారణల పేరుతో వేధింపులకు పాల్పడిన బీజేపీ ప్రభుత్వం ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కూలిన ప్రమాదంతో పాటు తాజాగా ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన పెను ప్రమాదాల పైన కనీసం స్పందించడం లేదన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పందించిన విధంగానే కనీసం జరిగిన ప్రమాదాలపైన విచారణ చేసి, కారణాలు కనుక్కొని ప్రజలకి వివరిస్తాయా లేదా ఎప్పటిలాగానే ఇక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాయా అన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ బీజేపీపైన విమర్శలు చేస్తూ పోరాటం చేస్తున్నానని చెప్పుకొని తిరుగుతుంటే.. ఇక్కడ ఆశ్చర్యంగా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్న విషయం అనేకసార్లు స్పష్టమైందని కేటీఆర్ గుర్తుచేశారు.

కేంద్ర ప్రభుత్వం కప్పిపుచ్చుతున్న అనేక హై ప్రొఫైల్ కుంభకోణాలపై కేటీఆర్ ప్రధానంగా దృష్టి సారించారు. అమృత్ టెండర్ల కుంభకోణం, పౌర సరఫరాల కుంభకోణంలో కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం ఇందులో పాలుపంచుకుందని ఆయన ఎత్తి చూపారు. అయినప్పటికీ, బీజేపీ కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవడంలో విఫలమైంది.అని కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ 1337 కోట్ల కేంద్ర పట్టణాభివృద్ధి మరియు పురపాలక శాఖ నిధులను రేవంత్ రెడ్డి తన సొంత బావమరిదికి అప్పనంగా కట్టబెట్టి, అమృత్ పథకంలో చేసిన స్కాం తాలూకు పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి స్వయంగా వెళ్లి అందజేశామని, అయితే సాక్ష్యాలు అందించినా.. ఇప్పటిదాకా కనీసం కేంద్రం స్పందించకుండా రేవంత్ రెడ్డిని కాపాడుతుందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రి పొంగులేటిపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసి, భారీగా నగదుతో పాటు ఆస్తులను గుర్తించినట్లుగా వార్తలు వచ్చి ఐదు నెలలు దాటిన ఇప్పటిదాకా కనీసం ప్రకటన కూడా చేయలేదు అన్నారు.

రాహుల్ గాంధీ బీజేపీపై చేసిన విమర్శలపై కూడా కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుడు జాతీయ స్థాయిలో నిరంతం దాడి చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేస్తున్నట్లు కనిపించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రెండు పార్టీలు రాష్ట్ర పాలనను నిర్వహిస్తున్న తీరులో, అవినీతి కుంభకోణాలను కప్పిపుచ్చడంలో ఈ కూటమి మరింత స్పష్టంగా కనిపిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.

Next Story